-సుమారు రూ.3,300 కోట్ల విలువైన 29 కొత్త ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందాయి: శర్వానంద సోనోవాల్
-ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.2,500 కోట్ల విలువైన 13 రో-పాక్స్ & ప్యాసింజర్ జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు, ఓడరేవుల ఆధునికీకరణ, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుల అమలు; సాగరమాల పథకం కింద వాటికి ఆర్థిక సాయం అందుతోంది: శర్వానంద సోనోవాల్
-రూ.2,530 కోట్ల విలువైన 22 ఐడబ్ల్యూఏఐ, వీపీఏ ప్రాజెక్టులు పూర్తి: శర్వానంద సోనోవాల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓడరేవుల అభివృద్ధి, తీరప్రాంత బెర్తులు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు సహా వివిధ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.3,300 కోట్ల విలువైన 29 కొత్త ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రిత్వ శాఖకు వచ్చాయని కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా, జల మార్గాల శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ వెల్లడించారు. దాదాపు రూ.2,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రస్తుతం సాగరమాల పథకం కింద ఆర్థిక సాయం అందుతోందన్నారు. వీటిలో రో-పాక్స్ & ప్యాసింజర్ జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు, ఓడరేవు ఆధునికీకరణ, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల అభివృద్ధికి మంత్రివర్గం ఇప్పటికే రూ.450 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి వివరించారు.
సాగరమాల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి అందిన ప్రతిపాదనలపై ఎంపీలు తెన్నేటి కృష్ణ ప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి శర్వానంద సోనోవాల్ ఈ రోజు సమాధానం చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు నుంచి అందిన 90 ప్రాజెక్టు ప్రతిపాదనలను ధృవీకరించాలని తమ ప్రశ్నలో ఎంపీలు కోరారు. ఆ ప్రాజెక్టుల అంచనా వ్యయం, పూర్తి చేయడానికి అంచనా వేసిన సమయం, అమలు వివరాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు సహా వాటి సమగ్ర సమాచారాన్ని చెప్పాలని మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. దీంతోపాటు, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుపైనా సమాచారాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ఐడబ్ల్యూఏఐ రూ.4,600 కోట్ల పెట్టుబడులతో 36 ప్రాజెక్టులను చేపట్టాయని తన సమాధానంలో కేంద్ర మంత్రి వెల్లడించారు. వీటిలో, రూ.2,530 కోట్ల విలువైన 22 ప్రాజెక్టులు పూర్తి కాగా, రూ.2,070 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలులో ఉన్నాయి. విశాఖపట్నం ఓడరేవులో అత్యాధునిక అంతర్జాతీయ క్రూయిజ్ కమ్ కోస్టల్ టెర్మినల్‌ను అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం నిర్మించారు.
ఎలాంటి రాబడి లేని లేదా తక్కువ రాబడి ఉన్న & అధిక సామాజిక ప్రభావాన్ని చూపే ప్రాజెక్టులకు సాగరమాల పథకం కింద మంత్రిత్వ శాఖ నుంచి ఆర్థిక సాయం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన 29 కొత్త ప్రతిపాదనల్లో రూ.1,200 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులకు మంత్రిత్వ శాఖ పాక్షికంగా నిధులు సమకూర్చింది. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవుల అభివృద్ధి విషయానికి వస్తే, ఆ ప్రాజెక్టులను పునర్నిర్మించాలని & పీఎం గతిశక్తి కింద మూలధన పెట్టుబడుల కోసం అవకాశాలను అన్వేషించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంత్రిత్వ శాఖ సూచించింది. కోస్టల్ బెర్తులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు సంబంధించిన ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది.
సముద్ర రంగం దశను మార్చడానికి, దేశంలోని విస్తృతమైన తీరప్రాంతాన్ని ఉపయోగించుకోవడానికి, ఓడరేవు కేంద్రంగా జలమార్గాలను అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చిన ప్రధాన చొరవ ఈ సాగరమాల కార్యక్రమం అని సోనోవాల్ స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక పరిమితులు విధించలేదు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, ఈక్విటీ భాగస్వామ్యం, గ్రాంట్ల ద్వారా ఈ ప్రాజెక్టులకు నిధులు అందించడం జరుగుతుంది.
ముంబై, విశాఖపట్నంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్’ (సెమ్స్) ఏర్పాటు గురించి కూడా సోనోవాల్ ప్రస్తావించారు. ఆసియాలోనే తొలిసారిగా, విశాఖపట్నం కేంద్రంలో ఇంజినీరింగ్, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన 10,000 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు.
అంతేకాదు, ప్రస్తుతమున్న 80 పడకల గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా 300 పడకల మల్టీ-డిసిప్లినరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చడానికి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ పంపిన ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.222.43 కోట్లు. వీపీఏ ఉద్యోగుల చికిత్సకు అయ్యే వార్షిక వైద్య వ్యయాన్ని ఈ ప్రాజెక్టు తగ్గిస్తుంది. అంతేకాదు, వైద్య, పారామెడికల్, ఇతర సిబ్బందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
గత దశాబ్ద కాలంలో, 2022-23 నాటికి దేశంలోని ఓడరేవుల సామర్థ్యం దాదాపు 2,500 ఎంటీపీఏ వద్దకు (2014-15 నుంచి 86% వృద్ధి) చేరింది, ప్రధాన ఓడరేవుల్లో సరకు నిర్వహణ సామర్థ్యం రెండింతలు పెరిగింది అని కూడా శ్రీ సోనోవాల్ స్పష్టం చేశారు.
సాగరమాల కార్యక్రమం ద్వారా సముద్ర ప్రాంత మౌలిక సదుపాయాలను పెంచడానికి, తీర ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ఈ సమగ్ర వివరణ అద్దం పడుతుంది.
Prajavartha Online Telugu News