మచిలీపట్నం, సెప్టెంబర్ 6
జిల్లాలో వరద బాధిత ప్రాంత ప్రజల రుణాల కాలపరిమితి రీ షెడ్యూల్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో వరద పరిస్థితి సమీక్షించేందుకు శుక్రవారం కలెక్టరేట్ మీకోసం హాలులో బ్యాంకర్లతో జిల్లా సమన్వయ సంప్రదింపుల కమిటీ (DCC/DLRC) ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో వరద పరిస్థితి సమీక్షించి, ఇప్పటివరకు జిల్లాలో తీసుకున్న సహాయ కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లాలో 15 మండలాల్లో 62 గ్రామాలు వరద తాకిడికి గురి కాగా, 20 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 2.37 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి 37,724 హెక్టార్లలో పంటలు, 4039 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 55.32 హెక్టార్లలో సెరికల్చర్ పంటలు నష్టం జరిగిందని, ఎన్యుమరేషన్ కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విపత్తును ఎదుర్కొన్నామని, ప్రకాశం బ్యారేజీ నిర్మించాక ఇంతటి వరద ఉధృతి గతంలో ఎన్నడూ సంభవించలేదని, మరోవైపు జిల్లాలో వేలాది క్యూసెక్కుల బుడమేరు వరద కారణంగా గ్రామాలు, వేలాది ఎకరాల్లో పంటలు ముంపుకు గురయ్యాయన్నారు.
జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన జిల్లాగా ప్రకటించుటకు కమిటీలో ప్రతిపాదించారు. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడమే మన లక్ష్యం కావాలన్నారు. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బిఐ తో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపిందన్నారు. బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నదని కలెక్టర్ తెలిపారు. బ్యాంకర్లు మానవీయ కోణంతో వ్యవహరించాలని, జిల్లాలో వరద బాధిత ప్రాంత ప్రజల రుణాల కాలపరిమితి రీ షెడ్యూల్ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలని, ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలన్నారు.
ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జయవర్ధన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వెంకట్రావు, వ్యవసాయ శాఖ డిడి మనోహర్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News