-ఈ నెల 25న మధ్యాహ్నం 3 గం. నుండి 26 న రాత్రి 7 గం. ల వరకు డ్రై డే మద్యం దుకాణాలు బంద్: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ
-బందోబస్తు, భద్రత చర్యలు పకడ్బందీగా ఉండాలి: ఎస్పి సుబ్బరాయుడు
-పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాం: సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా
వెంకటగిరి, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం వెంకటగిరి పింజలి వీరయ్య కళ్యాణ మంటపం నందు కలెక్టర్ గారు స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఐఏఎస్, మునిసిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, ఎంపీపీ తనూజా రెడ్డి మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవoగా నిర్వహించేందుకు సంబంధించి శాఖల విభాగాలు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. క్యూ లైన్ నియంత్రణ, కంట్రోల్ రూం ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, మెడికల్ క్యాంపు లు ఏర్పాటు, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచడం, త్రాగు నీరు ఏర్పాటు తగినంత ఉండాలని, విద్యుత్తు సరఫరా లో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని, ఫైర్ సేఫ్టీ, బ్యారికేడ్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్, రవాణా సౌకర్యం, హెల్ప్ డెస్క్ తదితర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ముగింపు రోజులలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 25న మధ్యాహ్నం 3 గం. నుండి 26 న రాత్రి 7 గం. ల వరకు డ్రై డే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ ఏర్పాటు ఉండేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి గారు కూడా రానున్నారని తెలిపారు. దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని కల్పించాలని తెలిపారు. గతంలో కన్నా రేట్లు తగ్గించి రూ.300, రూ.100 మరియు ఉచిత దర్శనం వంటి ఏర్పాటుతో పాటు విఐపి క్యూ లైన్ ఏర్పాటుతో 4 క్యూ లైన్లు ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ప్రజలు అమ్మవారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఎస్పీ మాట్లాడుతూ సుమారు 1245 మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, 104 సీసీ కెమెరాల ఏర్పాటుతో కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించనున్నామని, పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాణాసంచాలు ఈ నెల 25న రాత్రి 7 నుండి రాత్రి 9 వరకు పాత బస్ స్టాండ్ సమీపంలో ఆరు బయలు నందు మాత్రమే కాల్చడానికి అనుమతి అని తెలిపారు.
సబ్ కలెక్టర్ గూడూరు మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయము చేసుకుని పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, గూడూరు డిఎస్పీ రమణ కుమార్, జిల్లా దేవదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, వెంకటగిరి మునిసిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, జిల్లా అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News