-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
కడప/జమ్మలమడుగు, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు రాక కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. జమ్మలమడుగులో పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భరోసా పథకం సామాజిక పెన్షన్ల పంపిణీ, పీ-4 కార్యక్రమంతో పాటు టీడీపీ క్యాడర్ తోనూ సమావేశం కానున్నారని తెలిపారు. రూ.165 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులకు కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. జమ్మలమడుగులోని ఓ రిసార్టులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పుత్తా కృష్ణచైతన్య రెడ్డి, టీడీపీ నాయకులతో కలిసి ఇన్చార్జి మంత్రి సవిత మాట్లాడారు. శుక్రవారం ఒకటో తేదీ కావడంతో, జమ్మలమడుగులో సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం సీఎం చంద్రబాబునాయుడు వస్తున్నారన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పీ-4 మోడల్ సమావేశంలోనూ ఆయన పాల్గొంటున్నారన్నారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారని మంత్రి సవిత వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రాకతో కడప జిల్లాకు మహర్దశ పట్టిందన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధితో పాటు పర్యాటక అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. శుక్రవారం గండికోటలో రూ.160 కోట్ల పర్యాటక ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేయనున్నారన్నారు. అందులో రూ.80 కోట్లతో గండికోటను అభివృద్ధి చేయనున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పర్యాటకం కీలకమని సీఎం చంద్రబాబునాయుడు భావిస్తుంటారన్నారు. అందుకే రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టనున్న పీ-4 మోడల్ తో బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. నియోజక వర్గంలో పీ-4లో అమలులో భాగంగా గూడెంచెరువు వద్ద ప్రజా వేదిక బంగారు కుటుంబాలు, మార్గదర్శకులు, ప్రజలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు, నాయకులతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు జోడు గుర్రాల్లా పరుగులు తీయిస్తున్నారన్నారు. దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ఏపీలో పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఆగస్టు 2 నుంచి అన్నదాత సుఖీభవ పథకం, అదే నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత వెల్లడించారు..
సీఎం చంద్రబాబు రాకకు అంతా రెడీ
సీఎం చంద్రబాబు పర్యటన నిమిత్తం అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు. జమ్మలమడుగులోని గవర్నమంట్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను, అనంతరం గూడెం చెరువు వద్ద ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలించామన్నారు. పోలీసులు, ఇతర శాఖాధికారులు సమన్వనయంగా సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు.
సీఎం చంద్రబాబు పర్యటనా ఏర్పాట్ల పరిశీలన
అంతకుముందు సీఎం చంద్రబాబునాయుడు పర్యటనా ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పరిశీలించారు. ముందుగా, జమ్మలమడుగులోని గవర్నమంట్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను, అనంతరం గూడెం చెరువు వద్ద ప్రజా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పర్యటనల సలహాదారు పెందుర్తి వెంకటేష్, శాసన సభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, టీడీపీ నాయకులు రెడ్డప్ప గారి శ్రీనివాసుల రెడ్డి, భూపేష్ రెడ్డి, కడప, బద్వేల్ ఆర్డీవోలు జాన్ ఎర్విన్, చంద్ర మోహన్, పోలీసు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News