అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డిఏ) రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హౌసింగ్ & బిల్డింగ్ ప్రాజెక్టులలో భాగంగా ఎన్.జి.ఓ టవర్స్ 9 & 12 నిర్మాణ పనులను ఎల్ & టీ కన్‌స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. ఎల్ & టీ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఈ ప్రాజెక్టులో ఈ నెల 18 వరకు 10 లక్షల సురక్షితమైన పనిగంటలను ‘లాస్ట్ టైమ్ ఇంజరీ (LTI)’ లేకుండా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టులో సాధించిన ఈ మైలురాయి నిర్మాణ రంగంలో సిఆర్డిఏ పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మైలురాయి సాధించేందుకు ప్రధాన కారణాలను CRDA అధికారులు వివరించారు. నిర్మాణ ప్రాంతంలో సురక్షిత విధానాలకు కట్టుబడి పనిచేయడం, కార్మికులకు క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలు, మరియు ప్రాజెక్టులో అమలు చేస్తున్న ముందస్తు భద్రతా చర్యల కారణంగా ప్రమాదాలు జరగకుండా నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న ప్రతి ఉద్యోగి, కాంట్రాక్టర్, ఇతర భాగస్వాములకు ఏపీ సిఆర్డిఏ అభినందనలు తెలియజేస్తోందన్నారు.
ఈ సందర్భంగా సిఆర్డిఏ ESM విభాగం డైరెక్టర్ నితిన్ శర్మ మాట్లాడుతూ… “ఎన్.జి.ఓ టవర్ల నిర్మాణ పనులలో సాధించిన ఈ ఘనత రాజధాని అమరావతి నిర్మాణంలో కార్మికుల భద్రతకు సిఆర్డిఏ తీసుకుంటున్న ప్రణాళికలను స్పష్టంగా తెలియజేస్తుంది. అమరావతి నిర్మాణ ప్రాజెక్టులలో భద్రత అత్యున్నత ప్రాధాన్యత. జాగ్రత్త, బాధ్యతతో కలిసి పనిచేస్తే ఎలాంటి ప్రమాదాన్ని అయినా నివారించగలమన్న నమ్మకాన్ని ఈ మైలురాయి మరింత బలపరుస్తోంది” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సోమవారం సిఆర్డిఏ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు, హార్టికల్చర్ డైరెక్టర్ ఎం.హరిప్రసాద్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ PBN కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి.అనితావాణి, సీనియర్ OHS స్పెషలిస్ట్ జి.గోపికృష్ణ , PgMC సీనియర్ లేబర్ & OHS స్పెషలిస్ట్ బి.శ్రీధర్ రెడ్డి, L&T OHS మేనేజర్ హెచ్.నీలాంచల్, L&T ప్రాజెక్టు మేనేజర్ వి.మణికందన్ తదితరులు పాల్గొని సంబంధిత సిబ్బందికి అభినందనలు తెలిపారు. సిఆర్డిఏ ESM విభాగం, PgMC, సిఆర్డిఏ OHS బృందం, PMC ప్రాజెక్టు బృందం మరియు ఎల్ & టీ కాంట్రాక్టర్ బృందాలు పాల్గొన్నాయి.
Prajavartha Online Telugu News