Breaking News

తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టండి

-రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించండి
-ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్ నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టిపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను, రిజర్వాయర్లలో, నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎగువన వర్షాలు కురుస్తున్నందున్న కృష్ణా బేసిన్ లో నీటి లభ్యత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని అధికారులు వివరించారు. కృష్ణానదిలో కొద్ది రోజులుగా ప్రవాహాలు మొదలైనట్లు వివరించారు. అలాగే గోదావరిలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాభావం వల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత వచ్చే అవకాశం ఉందని…దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాల్టీలు, గ్రామీణ ప్రాంతాల్లో తరుచూ తాగునీటి పరీక్షలు జరపాలని… ల్యాబ్ టెస్టుల నివేదికలను విడుదల చేయాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి… అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రవాణ శాఖలో పూర్తి స్థాయి టెక్నాలజీ వినియోగం, అనవసర నిబంధనల తొలగింపు వంటి అంశాలకు తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్, ఫారం-5B వంటి పరీక్షలను తొలగించడం వంటి చర్యల ద్వారా అవినీతిని తగ్గించడం, సులభతర సేవలను అందించే అవకాశం కలుగుతుందని అధికారులు చెప్పారు. దశలవారీగా రవాణా శాఖలో ఈ సంస్కరణలు చేపట్టేలా తాము ప్రణాళికను సిద్దం చేశామని తెలిపారు. వీలైనంత మేరకు అనవసర నిబంధనలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సానుకూల ముందడుగు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించి అమరావతి జర్నలిస్టుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *