Breaking News

జగనన్న లక్ష్య సాధనకు కలిసికట్టుగా ముందుకు సాగుదాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-వాలంటీర్ల వ్యవస్థ.. దేశానికే రోల్ మోడల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ/ వార్డు వాలంటీర్లు తమ బాధ్యతలను సైనికుల్లా నిర్వర్తిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సత్యన్నారాయణపురం AKTPM పాఠశాల నందు 31, 33, 36 డివిజన్ల వాలంటీర్లకు నిర్వహించిన ‘సేవా పురస్కారాల ప్రదానోత్సవ’ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేశారు. ఈ పురస్కారాలకు గానూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండున్నరేళ్లలో రూ. 465 కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించి.. ప్రోత్సాహకాల రూపంలో వాలంటీర్లకు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ఎన్నికలను ఎదుర్కొన్న జగనన్న.. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులు వేశారన్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఆగస్ట్ 15, 2019న వాలంటీర్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టి.. 2 లక్షల 66వేల 92 మంది వాలంటీర్లను నియమించారన్నారు. దేశ చరిత్రలోనే ఇదొక రికార్టని వ్యాఖ్యానించారు. వీరిలో 55 శాతానికి పైగా మహిళలను నియమించడం.. మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. ప్రజలకు సేవచేసే అవకాశం అందరికీ రాదని, వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు వాలంటీర్ల వ్యవస్థ తోడవడంతో నేడు మన రాష్ట్రం సుపరిపాలనలో దేశంలోనే ముందంజలో ఉందని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. వాలంటీర్‌ వ్యవస్థ వల్లే సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు చేరువ అవుతున్నాయని పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంతో పాలనను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అహర్నిశలు పనిచేశారని గుర్తుచేశారు. కానీ ఆ మహానేత మరణంతో ఆయన ఆశయాలన్నీ మరుగున పడ్డాయన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ కలలు కన్న స్థానిక సుపరిపాలనను వాలంటీర్ల వ్యవస్థ రూపంలో సాకారం చేసి చూపారన్నారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్, ప్రతి 2వేల మంది జనాభాకు ఒక సచివాలయంతో పాలన మరింత సుగుమం అయిందన్నారు. ప్రతినెల ఒకటో తేదీన సూర్యుడు ఉదయించడంతోనే అవ్వాతాతల తలుపు తట్టి పింఛన్ అందిస్తూ.. వారి చల్లని దీవెనలు అందుకుంటున్న నిస్వార్థ సేవకులు వాలంటీర్లను కొనియాడారు.

కరోనా కష్టకాలంలో వాలంటీర్ల సేవలు అమోఘం
కరోనా సమయంలో వాలంటీర్లు సైనికుల్లాగా పని చేశారని మల్లాది విష్ణు గుర్తుచేశారు. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే, సత్వర చికిత్సకు చర్యలతో మన రాష్ట్రంలో మరణాల సంఖ్యను తగ్గించడంలో వాలంటీర్లు ముఖ్య భూమిక పోషించారన్నారు. నగరంలోకి కొత్త వారు వస్తే గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం, క్వారంటైన్‌లో వారి బాగోగులు చూసుకోవడం, కరోనా సోకినవారికి నైతిక ధైర్యమిస్తూ అండగా నిలబడ్డారన్నారు. కరోనా నియంత్రణలో ఏపీ ప్రభుత్వం కేంద్రం ప్రశంసలు అందుకుందంటే వాలంటీర్ల ఎనలేని సేవలే అందుకు కారణమని మల్లాది విష్ణు అన్నారు. పేదల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటికే 4 వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే విద్యారంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని.. గడిచిన మూడేళ్లలో దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరోవైపు నాడు-నేడు కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 319 అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 70.72 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. ఇందులో AKTPM స్కూల్ లో 14 అదనపు తరగతులు మంజూరైనట్లు పేర్కొన్నారు.

మే ఒకటవ తేదీ నుంచి ప్రజల మధ్యే ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని.. అందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. ఈలోగా స్థానిక కార్పొరేటర్లు, వార్డు సెక్రటరీల సమన్వయంతో.. రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన సంక్షేమ బుక్ లెట్లను ఇంటింటికీ తిరిగి అందజేయాలని వాలంటీర్లకు సూచించారు. అనంతరం 31వ డివిజన్ కు సంబంధించి 62 మందికి సేవామిత్ర, 33వ డివిజన్ కు సంబంధించి 38 మందికి సేవామిత్రతో పాటు ఒకరికి సేవారత్న, 36వ డివిజన్ కు సంబంధించి 36 మందికి సేవామిత్ర అవార్డులను వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో కలిసి అందజేశారు.

డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని సహా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాలంటీర్ల వ్యవస్థను కీర్తిస్తుంటే.. మన రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు మాత్రం వ్యవస్థపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం విమర్శలను కృంగిపోకుండా.. జగనన్న ఆశయ సాధనకు సైనికుల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి మాట్లాడుతూ.. అవినీతికి తావు లేకుండా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో వారి సేవలు ప్రశంసనీయమన్నారు. 36వ డివిజన్ కార్పొరేటర్ బాలిగోవింద్ మాట్లాడుతూ.. పురస్కారాలను స్ఫూర్తిగా తీసుకుని సేవా వజ్ర అవార్డులను సొంతం చేసుకునేలా రాబోయే రోజుల్లో మరింత సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శిరీష మాట్లాడుతూ.. సేవా భావంతో పనిచేస్తున్న ప్రతి వాలంటీర్ వజ్రాలేనని.. పురస్కారానికి ఎంపికైన ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రేమ లక్ష్మీకుమారి, 33వ వార్డు వాలంటీర్ (సేవామిత్ర అవార్డు గ్రహీత) మాట్లాడుతూ.. వాలంటీర్లకు సేవలోనే ఆనందం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అందిస్తున్న సంక్షేమానికి వారథులుగా జగనన్న తమను నియమించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో వాలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ.. వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, బాలిగోవింద్, పెనుమత్స శిరీష సత్యం, డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శిష్లా రామలింగమూర్తి, జోనల్ కమిషనర్ రాజు, సీఐ బాలమురళికృష్ణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *