-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు వారి కుటుంబ సబ్యులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఇహెచ్ఎస్) ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక అవుట్ పేషెంట్ (ఓపీ ) విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషలిటి బ్లాక్ లో రాష్ట్ర ఉదోగులకు, పెన్షనర్లకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓపీ విభాగాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 25 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు , ఆర్టీసీ కార్మికులు మరో 23 వేల మంది ప్రభుత్వ పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు కలిపి 1లక్ష 40 వేల మంది ఇహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వారికీ మెరుగైన వైద్య సహాయం తక్షణమే అందించేలా రాష్టంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక ఇహెచ్ఎస్ ఓపీ విభాగాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో సూపర్ స్పెషలిటి బ్లాక్ నందు ఒక వైద్య నిపుణులు, ఇద్దరు సహాయక వైద్యులు, నలుగురు నర్సింగ్ సిబ్బందితో ఓపీ విభాగంలో సేవలు అందచేయడం జరుగుతుందన్నారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతి సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ మంగళవారం మానసిక వ్యాధులు జనరల్ మెడిసిన్ బుధవారం గుండె మరియు కిడ్నీ వ్యాధులు గురువారం ఎముకలు న్యూరాలజి జనరల్ మెడిసిన్ శుక్రవారం చర్మ వ్యాధులు మరియు జనరల్ మెడిసిన్ శనివారం ఊపిరితిత్తులు మరియు జనరల్ మెడిసిన్ కు సంబంధించి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ విభాగంలో సేవలు అందించడం జరుగుతుందన్నారు. రక్తపోటు, హైపర్ థైరాయిడిజం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కన్వస్లైవ్ డిజార్డర్, ఇన్ఫ్ల మేటరీ ప్రేగు వ్యాధి, సైకోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్, సోరియాసిస్, కార్డియాక్ ఫెయిల్యూర్, నెప్రోటిక్ సిండ్రోమ్, క్రానిక్ కిడ్నీ వంటి దీర్ఘకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి కార్పొరేట్ వైద్య సహాయం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు ఇహెచ్ఎస్ అమలు కమిటీ సభ్యులు ఎ. విద్యసాగర్ మాట్లాడుతూ ఉద్యోగుల పే స్కేల్ ఆధారంగా ఒక్కొక్కరి నుండి 225 రూపాయలు మరియు 300 రూపాయలు ఇహెచ్ఎస్ స్కీం కు కాంట్రిబ్యూషన్ కింద ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుందన్నారు. అనారోగ్యానికి గురైన ఉద్యోగులు వైద్య పరీక్షలు నిమిత్తం వ్యాధి నిర్ధారణ కొరకు ప్రైవేట్ ఆసుపత్రులను ప్రైవేట్ ల్యాబులను ఆశ్రయించడం ద్వారా వేలాది రూపాయలు ఖర్చుచేయవలసి వచ్చేదన్నారు. ఈ పరిస్థితిని నివారించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులూ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఆయన ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిర్దారించిన వ్యాధికి సంబంధించి అధునాతన పరిజ్ఞానంతో మెరుగైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ఇహెచ్ఎస్ ఓపీ విభాగాన్ని ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగిందని ఉద్యోగులకు సంబంధించిన ఓపీ వైద్య సేవలకు విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో తొలిసారిగా ప్రారంభించడం పట్ల జిల్లా ఉద్యోగ , ఉపాధ్యాయ , కార్మిక పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు.
ఓపీ విభాగాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ కు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డా. వెంకటరామయ్య వైద్య పరీక్షలు నిర్వహించారు.
కార్యక్రమంలో డా. వైస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ డా. జె. సుమన్, ఆసుపత్రి సూపరిండెంట్ డా. సౌభాగ్య లక్ష్మి, ఆర్ఏంవోలు మంగాదేవి, శోభారాణి, సిద్దార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. విఠల్ రావు, ఆసుపత్రి వైద్యులు డా. వెంకటరామయ్య, డా. నాగేశ్వరరావు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రతినిధులు ఎండి ఇక్బాల్, సిహెచ్ శ్రీరామ్, కె .సంపత్ కుమార్, కె. శివలీల, ఆరోగ్య మిత్రాలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News