విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలు నుండే స్థానిక సమస్యల పై అందే ఫిర్యాదులు పక్కాగా నమోదు చేసి, సంబందిత అధికారులకు పంపాలని నగరపాలక సంస్థ కాల్ సెంటర్ సిబ్బందిని కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, రిజిస్టర్ లో నమోదు చేసిన ఫిర్యాదుదారులతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలు తమ స్థానిక సమస్యల పై కాల్ సెంటర్ లేదా వాట్స్ అప్ కు ఇచ్చే ఫిర్యాదులను రిజిస్టర్ లో నమోదు చేయాలని, ఆయా సమస్యల వారిగా విభాగ అధికారులకు పంపాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యాక ఫిర్యాదుదారులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదును క్లోజ్ చేయాలని స్పష్టం చేశారు. గురువారం అందిన ఫిర్యాదుల్లో పట్టాభిపురం, కృష్ణ నగర్ ల నుండి ఫిర్యాదు చేసిన వారికి కమిషనర్ నేరుగా ఫోన్ చేసి వారి సమస్య తెలుసుకొన్నారు. నగరంలో ఇంకనూ త్రాగునీటి సమస్య పై ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, ఏ.ఈ.ల వారిగా త్రాగునీటి సరఫరా పై పిన్ పాయింట్ నివేదిక ఇవ్వాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. కాల్ సెంటర్ కి అందే ఫిర్యాదుల పరిష్కారం సత్వరంగా, సంపూర్ణంగా ఉండాలని, సదరు ప్రాంతాలను ఆకస్మిక తనిఖీలు చేస్తామని తెలిపారు. నగర ప్రజలు కూడా తమ స్థానిక సమస్యల పై అందుబాటులోని వార్డ్ సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని లేదా నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103, 104, 105 నంబర్లకు లేదా 98499 08391 కు వాట్స్ అప్ చేయవచ్చని తెలిపారు.
Prajavartha Online Telugu News