Breaking News

పౌష్టికాహారంతోనే ఉత్తమ ఫలితాలు

-మంచి ఆరోగ్యంతోనే మెరుగైన విద్య
-భోజన పథకం టీడీపీ అమలు చేస్తే… వైసిపి నిలిపి వేసింది…
-ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు
-డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

బాపట్ల/సంతమాగలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థి దశలో ఏటువంటి ఇబ్బందులూ కలుగకుండా, పౌష్టికాహార లోపం లేకుండా… కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా సంతమగలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, ఆహార నాణ్యత గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా కాలేజీ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు, వారి బంగారు భవిష్యత్ కు బాసటగా వుండే విధంగా… డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచన మంత్రి లోకేష్ దే అన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తెలుగుదేశం అమలు చేస్తే… వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం భోజన పథకాన్ని నిలుపుదల చేసి విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి విమర్శించారు. ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు లేని విద్య అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి వుందని ఆయన వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుతో… డ్రాప్ ఔట్స్ కూడా తగ్గే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

విద్యార్థులతో ఆత్మీయ సంభాషణ…

విద్యార్థులతో కలసి విద్యార్థిగా మారిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, తన కాలేజ్ రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ విద్యార్థులతో సరదాగా సంభాషించారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ… ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల్లోనూ సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు కూడా ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలని వారిని ఉత్సాహ పరిచారు. అదే విధంగా ప్రభుత్వ కళాశాలల్లో ఫెయిల్యూర్స్ పర్సంటేజ్ తగ్గి విద్యార్థిని విద్యార్థులు 100 శాతం ఉతీర్ణతతో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.

వాటర్ ప్లాంట్, ల్యాబ్ లు అందుబాటులోకి…
విద్యార్థులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆత్మీయ సంభాషణ సందర్భంగా… కొందరు విద్యార్థులు తమకు సరైన తాగునీటి వసతి లేదని, అదే విధంగా ప్రాక్టికల్స్ చేసుకోవడానికి ల్యాబ్ సౌకర్యం కూడా ఇంకా అందుబాటులోకి రాలేదని మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్… 10 రోజుల్లో యుద్ధప్రాతిపదికన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా అసంపూర్తిగా వున్న 8 గదుల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు అవసరమయ్యే ల్యాబ్స్ ను వెంటనే అందుబాటులోకి తేవాలని సూచించారు.

భూ సమస్యలన్నీ పరిష్కార మవ్వాల్సిందే…
భూ సమస్యలు పరిష్కరించి ప్రతి అర్జీ దారునికి న్యాయం చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా సంతమాగలూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో శనివారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో… మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన భూ సంబంధిత అవకతవలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. అధిక సంఖ్యలో వచ్చిన బాధితులు గత ప్రభుత్వ తప్పుడు, అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్నామని… తమ భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి… బాధితులకు న్యాయం చేసే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా… పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీ పరిష్కారం అవ్వాలన్నారు.

పంచాయితీల నిధులు పక్కదారి పట్టకూడదు….
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయితీల నిధులలో అవకతవకలు జరుగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య పనుల మీద దృష్టి సారించి…. గ్రామాలు పరిశుభ్రంగా వుండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రతి వినతినీ నిశితంగా పరిశీలించి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నేతలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *