-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త :
MICE టూరిజంనకు (meetings, incentives, conferences, exhibitions) నేటి కాలంలో విస్తృత ప్రాచుర్యం ఉన్నదని, మన తిరుపతి జిల్లాలో సదరు పర్యాటక, ఆతిథ్య రంగాలకు పుష్కల అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.
శనివారం ఉదయం శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని ఏర్పేడు మండల పరిధిలోని ఐఐటి కళాశాల క్యాంపస్ నందు ఆంధ్ర ప్రదేశ్ టూరిజం అథారిటీ మరియు జిల్లా పర్యాటక కౌన్సిల్ తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు డిటిసి చైర్మన్ గారి అధ్యక్షతన తిరుపతి జిల్లాలో మైస్ (MICE – Meetings, Incentives, Conferences, Exhibitions) పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు మరియు ప్రోత్సాహ దిశగా ఉన్న అవకాశాలు, ట్రెండ్స్ మరియు ఛాలెంజెస్ వంటి అంశాలపై ఒకరోజు కాన్ఫరెన్స్ పలు యూనివర్సిటీల విసి లు, విద్యా వేత్తలు, పారిశ్రామిక వేత్తలు,కార్పొరేట్ రంగ ప్రతినిధులు, ఆతిథ్య రంగ అసోసియేషన్ ప్రతినిధులు, ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధులు, శ్రీ సిటీ తదితర భాగస్వాముల ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించగా ఐఐటి డైరెక్టర్ తిరుపతి ప్రొ. కె.ఎన్. సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సదరు కాన్ఫరెన్స్ ను జ్యోతి ప్రజ్వలనతో ఆహుతులు ప్రారంభించగా జిల్లా కలెక్టర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మైస్ టూరిజం కాన్ఫరెన్స్ ఏర్పాటుకు ఐఐటి డైరెక్టర్ సహకారం మరువలేనిదని, ఈ కాన్ఫరెన్స్ నందు జిల్లాలో మైస్ టూరిజం ప్రమోషన్ కు గల అవకాశాలు, అనుసంధానం తదితర అంశాలపై మేథో మథనం చేసి ప్రణాళికల తయారీకి సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు. తిరుపతి జిల్లా నందు రోజుకు సుమారు 80 వేల నుండి లక్ష మంది దాకా ప్రజలు వివిధ అవసరాలపై వస్తుంటారని, ప్రముఖంగా తిరుమల శ్రీవారి దర్శనానికి ఎక్కువగా వస్తుంటారని వారిని రెండు నుండి మూడు రోజులు జిల్లాలో విడిది చేసేలా చూడగలిగితే పర్యాటక రంగం, ఆతిథ్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మైస్ టూరిజం (MICE టూరిజం) లో భాగంగా సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్ లు, ఎగ్జిబిషన్ లు నిర్వహణ ద్వారా జిల్లాలో పర్యాటక, ఆతిథ్య రంగ అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్నాయని అన్నారు. తిరుపతి జిల్లాలో సుమారు 75 కిమీ ల నిడివి గల సముద్ర తీరం ఉందని, 6 బీచ్ లు ఉన్నాయని, తలకోన, అరై, టిపి కోన, కైలాసగిరి తదితర వాటర్ ఫాల్స్ ఉన్నాయని అన్నారు. తుంబుర తీర్థం తిరుమల కొండపైన పర్యాటక ప్రదేశం అని అన్నారు. బీచ్ టూరిజం, లీజర్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. స్పిరిచ్యువల్ టూరిజంలో భాగంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీకాళహస్తి, సురుటుపల్లి టెంపుల్, శ్రీ పద్మావతి అమ్మవారి గుడి గోవిందరాజు స్వామి టెంపుల్ తదితర ఆలయాలు ఉన్నాయని అన్నారు. మైస్ టూరిజం లో మనం వెనుకబడి ఉన్నామని, దీని అభివృద్ధికి జిల్లాలో పుష్కల అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఐదు నక్షత్రాల హోటల్, మూడు నక్షత్రాల హోటల్లు తాజ్ హోటల్, ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లు ఉన్నాయని, లెమన్ ట్రీ, మ్యాడ్రిడ్, ఒబెరాయ్, హోటల్ లు తొందరలోనే అందుబాటులోకి రానున్నాయని, లులు మాల్ వంటి వ్యాపార దిగ్గజాలు మన జిల్లా వైపు చూస్తున్నాయని తెలిపారు. మైస్ టూరిజం అభివృద్ధి చెందితే పలువురికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. విలక్షణమైన పర్యావరణం కలిగిన పులికాట్ లేక్, పులికాట్ బర్డ్ అభయారణ్యంలో ఫ్లెమింగో పక్షులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని , నేలపట్టు అభయారణ్యం గ్రే ఫెలికాన్ తదితర వలస పక్షులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయని అన్నారు. మైస్ టూరిజం అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు చేపడతామని అన్నారు.
ఐఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి జిల్లాలో పర్యాటక రంగానికి పుష్కల అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉన్నత కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి, ఐజర్, సంస్కృత యూనివర్సిటీ లు తిరుపతి జిల్లాలోని ఉన్నాయని అన్నారు. ఎస్వీ యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, వెటర్నరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ లతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీలు మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ సిటీ నందు ఐఐఐటి, క్రియా యూనివర్సిటీ లు ఉన్నాయని అన్నారు. ఉన్నతమైన స్విమ్స్ మెడికల్ కాలేజీ కూడా ఉందని తెలిపారు. మైస్ పర్యాటక రంగానికి జిల్లాలో అనుకూల వాతావరం ఉన్నదని సెమినార్లు, ముఖాముఖీలు, పరీక్షలు, అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు వంటివి నిర్వహించినప్పుడు వచ్చే ప్రముఖులు, సభికులు రావడం, వారు బసచేయడం వలన వారు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి, పుణ్యక్షేత్రాలను దర్శించుకొనడానికి సమయం కేటాయించి రెండు మూడు రోజులు ఉండే అవకాశం మెండుగా ఉన్నదని అన్నారు. ఆతిథ్య రంగం, పర్యాటక రంగ అభివృద్ధితో యువతకు ఉపాధి, ఆదాయ మార్గాలు పెంపొందుతాయని తెలిపారు. ప్రఖ్యాత ఇండియన్ కల్నరి ఇన్స్టిట్యూట్ మన జిల్లాలో ఉందని గుర్తు చేశారు. ఐఐటి నందు 18 క్లబ్స్ ఏర్పాటుతో ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్ సందర్శనకు, ఎకో టూరిజంలో భాగంగా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు వెళ్లడం జరుగుతోందని తెలిపారు. తిరుపతి నేచర్ క్లబ్ శ్రీ సిటీ నందు ఉన్నదని తెలిపారు. అలాగే విలక్షణమైన పర్యావరణ స్థితిగతులు పులికాట్ సరస్సు పరిసరాల్లో ఉన్నాయని తెలిపారు.
ప్రొఫెసర్ వై.వెంకట్రావు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం స్టడీ పుదుచ్చేరి యూనివర్సిటీ, డి.వి వినోద్ గోపాల్ ఈవెంట్ మేనేజర్, చెన్నై వారు మైస్ టూరిజం పై పలు అంశాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, జిల్లా ఫారెస్ట్ అధికారి మరియు జూ పార్క్ క్యూరటర్ సెల్వం, ప్రాంతీయ పర్యాటక సంచాలకులు డాక్టర్ రమణ ప్రసాద్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొ.రజనీ తదితర కాన్ఫరెన్స్ లోని భాగస్వాములు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News