విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయిలో ఖరీఫ్, 2025 పంటల జోనల్ కాన్ఫరెన్స్ అన్ని రాష్ట్రాల వ్యవసాయ కమీషనర్లతో, భారత ప్రభుత్వం తరుపున జాయింట్ సెక్రటరీ (ఐ.ఎన్.ఎమ్) మరియు ఎరువుల శాఖ ఉన్నతాధికారులు వివిధ రాష్ట్రాలకు అవసరమైన ఎరువులపై సమీక్షా సమావేశం గురువారం జరిపినారు.
ఈ సమావేశం నందు అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల యొక్క ఖరీఫ్ పంటల విస్తీర్ణం, పండించే పంటలు, భూసార పరిస్థితులను అనుసరించి (ఎన్.పి.కె మరియు సూక్ష్మపోషకాల లభ్య పరిస్థితులు) మరియు గత 5 సంవత్సరాల వివిధ ఎరువుల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని వివిధ రాష్ట్రాలకు రసాయనిక ఎరువులైన యూరియా, డి.ఎ.పి, ఎమ్.ఓ.పి (పోటాష్ ), ఎస్.ఎస్.పి (సూపర్ ఫాస్ఫేట్) మరియు కాంప్లెక్స్ ఎరువులను ఆయా రాష్ట్రాల కమీషనర్లతో చర్చించి ఎరువుల శాఖ, భారత ప్రభుత్వం వారి సూచనల మేరకు కేటాయించడం జరిగినది.
ఈ సమావేశంలో ఎరువుల వాడకాన్ని తగ్గించే దిశగా రాష్ట్రాలు రైతులను చైతన్య పరిచి సేంద్రియ వ్యవసాయన్ని ప్రోత్సహించవలెనని మరియు సేంద్రియ ఎరువుల, నానో ఎరువులు వాడకాన్ని పెంపొందించవలెనని రాష్ట్రాలను కోరారు.
2025 సంవత్సరం ఖరీఫ్ సీజన్ కి గాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి 15.26 లక్షల హెక్టార్లు, వేరుశనగ 4.94 లక్షల హెక్టార్లు, ప్రత్తి 5.36 లక్షల హెక్టార్లు, కంది 3.65 లక్షల హెక్టార్లు, మినుము 0.37 లక్షల హెక్టార్లు, పెసర 0.09 లక్షల హెక్టార్లు, జొన్న 0.10 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 1.46 లక్షల హెక్టార్లు, నువ్వులు 0.11 లక్షల హెక్టార్లు. రాగి 0.24 లక్షల హెక్టార్లు, మిరప 2.46 లక్షల హెక్టార్లు, కూరగాయలు 0.45 లక్షల హెక్టార్లు మరియు ఇతర వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు కలుపుకొని మొత్తం 55.25 లక్షల హెక్టార్లుగా అంచనా వేయడమైనది.
మన రాష్ట్రంలో 71 శాతం నేలలలో నత్రజని లభ్యత తక్కువగాను, 17.56 శాతం నేలలలో లభ్య భాస్వరం తక్కువగాను మరియు 13 శాతం నేలలలో పొటాష్ లభ్యత తక్కువగాను ఉన్నవి. సూక్ష్మపోషకాలైన జింక్ 38 శాతం నేలలలోను, ఐరన్ 31 శాతం నేలలలోను, బోరాన్ 21 శాతం నేలలలోను, మాంగనీస్ 13 శాతం నేలలలోను లభ్యత తక్కువగా ఉన్నవి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు సలహా మరియు చొరవతో ఖరీఫ్ 2025కి రాష్ట్ర ఎరువుల అవసరాలను ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్. ఢిల్లీ రావు కేంద్ర ప్రభూత్వ అధికారులకు తెలియజేసారు.
మన రాష్ట్రం యొక్క పంటల విస్తీర్ణం పోషకాల లభ్యత మరియు గత 5 సంవత్సరాల ఎరువుల వినియోగాన్ని బట్టి వ్యవసాయ శాఖ మరియు ఎరువుల శాఖ భారతదేశ ప్రభుత్వం వారు మన రాష్ట్రానికి యూరియా 6.50 లక్షల మెట్రిక్ టన్నులు. డి.ఎ.పి. 2.60 లక్షల మెట్రిక్ టన్నులు. ఎమ్.ఓ.పి. (పోటాష్ ) 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 6.30 లక్షల మెట్రిక్ టన్నులు. ఎస్.ఎస్.పి. (సూపర్ ఫాస్ఫేట్) 0.94 లక్ష మెట్రిక్ టస్నులు, ఇతర ఎరువులు 0.27 లక్షల మెట్రిక్ టన్నులు. (మొత్తం 17.31 లక్షల మెట్రిక్ టన్నులు) కేటాయించబడినదని డైరెక్టర్ వ్యవసాయ శాఖ, ఎస్.డిల్లీ రావు తెలిపారు.
నానో యూరియా మరియు నానో డి.ఎ.పి.లను యూరియా, డి.ఎ.పి ఎరువుల స్థానంలో వాడేలగా తగు చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వం రాష్ట్రానికి సూచించడమైనది.
బాస్వరం ఎరువులను సూపర్ ఫాస్ఫేట్ (SSP) రూపం లో వాడటం వల్ల నేలకు కావాల్సిన ఇతర పోషకాలైన గంధకం మరియు కాల్షియమ్ కూడా అందుబాటులోకి రావడమే కాకుండా నేల స్వభావము కూడా మారి మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపాదించిన రసాయన ఎరువులను భారత ప్రభుత్వం ఆమోదించడం చాల సంతోషంగా ఉందని, రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని DAPని అదనంగా కేటాయించడం జరిగింది. అలాగే డి.ఎ.పి. కి బదులుగా అందులో ఉన్న మూలకాలు లబ్యమయ్యే ఇతర ఎరువులైన కాంప్లెక్స్ వాడటంవలన నత్రజని, బాస్పరం మరియు పొటాషియం పోషకాలు ఏకకాలంలో మొక్కకు అందించడమే కాకుండా మొక్క ఎదుగుదలకు, పంట దిగుబడి మరియు నాణ్యతకు కావలసిన పోషకాలు మొక్కకు అందుతాయని అని డైరెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News