– ఇప్పటికే పూర్తయిన 96 శాతం పీజీఆర్ఎస్-రెవెన్యూ సదస్సుల అర్జీల పరిష్కారం
– మిగిలిన 4 శాతం అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయి అధికారులు కృషిచేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నమోదైన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) రెవెన్యూ అర్జీలతో పాటు రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 4,832 పిటిషన్లు రాగా ఇప్పటివరకు 4,637 (96 శాతం) మేర పరిష్కారం పూర్తయిందని, మిగిలిన నాలుగు శాతం అర్జీలపైనా ప్రత్యేక దృష్టిపెట్టి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి రెవెన్యూ పిటిషన్ల పరిష్కారంపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్-రెవెన్యూ అర్జీల పరిష్కార పురోగతిని పరిశీలించారు. పెండింగ్ అర్జీలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నందిగామ డివిజన్‌కు సంబంధించి మొత్తం 2,022 అర్జీలు రాగా 1,931 అర్జీల పరిష్కారం పూర్తయిందన్నారు. అదేవిధంగా తిరువూరు డివిజన్‌కు సంబంధించి 1,304 అర్జీలు రాగా అన్ని అర్జీలు పరిష్కారం కాగా విజయవాడ డివిజన్‌కు సంబంధించి 1,506 అర్జీలు రాగా 1,402 అర్జీలు పరిష్కారమైన్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అర్జీ అందుకున్నప్పుడే క్షుణ్నంగా పరిశీలించి.. సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో నేరుగా లేదా వర్చువల్‌గా మాట్లాడి తగిన సూచనలు ఇవ్వడం జరిగిందని.. వివిధ శాఖల అధికారుల పటిష్ట సమన్వయం, సమర్థవంతమైన ఆడిటింగ్ చర్యలు వల్లే అర్జీల పరిష్కారంలో జిల్లా ముందంజలో ఉందని.. ఇకపైనా ఇదే విధమైన పనితీరుతో పెండింగ్ అర్జీలను పరిష్కరించి, శతశాతం లక్ష్యాన్ని చేరుకుందామని పేర్కొన్నారు. నోడల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, ఏదైనా అర్జీ పరిష్కారంలో ఎదురయ్యే అడ్డంకులను పరిష్కరించేందుకు సమన్వయ శాఖల అధికార బృందాలు ఎప్పటికప్పుడు సమావేశమవ్వాలని ఆదేశించారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్), రీసర్వేకు సంబంధించిన పెండింగ్ అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్-గ్రామ సభలకు సంబంధించి 3,982 అర్జీలు రాగా ఇప్పటికే 3,960 అర్జీలు పరిష్కారమయ్యాయని తెలిపారు. రీ సర్వేకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులు రైతులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. వారిచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో నివేదికలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే, ల్యాండ్ రికార్డ్స్) టి.త్రివిక్రమరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News