-భూ కేటాయింపులు, మౌలిక వసతుల ఏర్పాటుపై మంత్రి సమీక్ష
-ప్లాంట్ల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తాం
-సీబీజీ ప్లాంట్ల నిర్మాణంతో 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
-బంజర భూముల్లో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటుతో రైతులకు అదనపు ఆదాయం
-స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని పెట్టుబడులు
-సీబీజీ ప్లాంట్లపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయబోయే 500 కంప్రెస్ట్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. సీబీజీ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి రిలయన్స్ ప్రతినిధులు, ఇంధన శాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి గొట్టిపాటి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో సీబీజీ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి రూ.65,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి రిలయన్స్ సంస్థ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది. ఈ నేపధ్యంలో ప్లాంట్ల నిర్మాణం ప్రారంభానికి అవసరమైన సంస్థాగత చర్యలపై మంగళవారం జరిగిన సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో తొలి దశలో ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో బంజర భూముల్లో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్, రిలయన్స్ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రమంలో ప్రకాశం, పల్నాడు జిల్లాల కలెక్టర్లతో భూకేటాయింపుల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని బంజర భూములను గుర్తించాలని కోరారు. ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా రిలయన్స్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సి భూ అనుమతులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కూడా చర్చించినట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. క్లీన్ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి సంబంధించి రిలయన్స్ సంస్థకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హామీ ఇచ్చారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యాపార అనుకూలమైన ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్లాంట్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని, దానికి అవసరమైన భూ కేటాయింపులు, మౌలిక వసతులతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ చేసి రిలయన్స్ కు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
సీబీజీ ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలోని 2.5 లక్షల నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేయడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా నిలపడమే తమ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులతో రిలయన్స్ తో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు. పారిశ్రామిక అనుకూల పాలసీలతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వివిధ ప్రాజెక్ట్ లను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి వస్తున్నాయని వెల్లడించారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల సంస్కరణలను అమలు చేస్తున్న నేపధ్యంలో… రిలయన్స్ సంస్థ ఏపీలో ఏర్పాటు చేసే సీబీజీ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను సాధ్యమైనంత వేగవంతం చేయాలని ఆ సంస్థ ప్రతినిధులకు మంత్రి గొట్టిపాటి మరోసారి సూచించారు. కార్యక్రమంలో రిలయన్స్ ప్రతినిధులతో పాటు ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News