-పంచాయతీ ఛాంపియన్స్ కు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) దిశా నిర్దేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కలిగించటం తోపాటు, మహిళా స్వయం సహాయక సంఘాలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాలు వివరించటంతోపాటు, ప్రజలకు తాగునీరు, రైతులకు సాగు నీరు సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా చూడాలని పంచాయతీ ఛాంపియన్స్ కి ఎంపి కేశినేని శివనాథ్ దిశా నిర్దేశం చేశారు. అలాగే పంచాయతీ ఛాంపియన్స్ కి ఎంపి కేశినేని శివనాథ్ టీ షర్ట్స్ అందించారు.
హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ లో ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు సమగ్ర గ్రామీణాభివృద్దికి తన సొంత నిధులతో శిక్షణ ఇప్పించిన 32 మంది పంచాయతీ ఛాంపియన్స్ తో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సమావేశం అయ్యారు. రాబోయే మూడు నెలల్లో పంచాయతీ ఛాంపియన్స్ వారి గ్రామాల్లో ఏ విధంగా పనులు నిర్వహించాలో కర్తవ్య బోధన చేశారు.
మార్చి 1వ తేదీ నుంచి పంచాయతీ ఛాంపియన్స్ గ్రామాల్లో తిరిగి సమస్యలు గుర్తించాలన్నారు. ముందు రెండు రోజులు ఒక మండలానికి చెందిన ఎనిమిది మంది ఒక టీమ్ గా కలిసి తిరిగి ప్రాక్టికల్ గా వచ్చే సమస్యలను గమనించి వాటిని అధిగమించాలన్నారు.. ప్రతి నెలకి పది వేల రూపాయల చొప్పున పంచాయతీ చాంఫియన్స్ కి ఉపకార వేతనం కేశినేని ఫౌండేషన్ ద్వారా అందుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలను ఈ ఆరునెలల కాలంలో సమగ్రంగా అభివృద్ది చేయాలన్నారు.
ముందుగా గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు గుర్తించి తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా ఎస్.సి., బిస్.సి కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించాలన్నారు. అలాగే యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా చూడాలన్నారు. నాలుగు మండలాల్లోని ఎంచుకున్న 24 గ్రామాల్లో 24 క్రికెట్ టీమ్స్ ను తయారు చేయాలన్నారు.
ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే కేంద్ర పథకాలైన సూర్య ఘర్ ,విశ్వకర్మ, పి.ఎమ్.ఈ.జి.పి వంటి పథకాలపై అవగాహన పెంచి వాటిని వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్తని తయారు చేయటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న కార్యక్రమాలు వివరించి ప్రజలను పారిశ్రామిక వేత్తలు తయారు చేయాలన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని 294 గ్రామాలను అభివృద్ది చేయటమే కాకుండా , దేశంలోనే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఏప్రిల్ మొదటి వారంలో ఇంకొంత మందికి హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ లో సమగ్ర గ్రామీణాభివృద్దికి శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్స్ సొంగా సంజయ్ వర్మ, జివి నరసింహారావు, తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం, మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం, జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట రూరల్ మండలం ,నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం నుంచి శిక్షణ తీసుకున్న పంచాయతీ చాంపియన్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News