గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తో కలిసి కౌన్సిల్ సమావేశమందిరం నందు నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణ పై సచివాలయ ఎన్విరాన్మెంట్ మరియు ఎమినిటి కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశం నందు మేయర్ మాట్లాడుతూ, గుంటూరు నగరం అమరావతి రాజధాని ప్రాంతంలో భాగంగా ఉన్నందున, రాజధాని ప్రాంతానికి ఎంతో మంది వివిధ పనుల పై వస్తుంటారని, వారు గుంటూరు నగరం మీదుగా వచ్చే అవకాశం ఉంటుందని, వారు గుంటూరు నగరానికి వచ్చే సందర్భంలో పారిశుధ్యం బాగా లేకపోతే గుంటూరు కార్పోరేషన్ కు చెడ్డ పేరు వస్తుందని, కావున కార్యదర్శులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తమ డివిజన్ల పరిధిలో తిరుగుతూ పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా గుంటూరు నగరం పై ప్రత్యేక ద్రుష్టి సారింఛి, నగరాభివృద్దికి సహకారాలు అందిస్తున్నారన్నారు. కార్యదర్శులకు మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లకు పారిశుధ్య పనుల నిర్వహణలో సమస్యలేమైనా ఉంటె తమ ద్రుష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు.
సమావేశం నందు కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా పారిశుధ్య కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు మరియు మధ్యాన్నం 3.30 గంటల నుండి 6 గంటల వరకు సమయాన్ని నిర్దేశించుట జరిగిందన్నారు. నగరంలో పారిశుధ్యం ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, చాలా ప్రాంతాలలో పారిశుధ్య పనుల నిర్వహణలో పిర్యాదులు అందుతున్నాయని, విధుల యందు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రోజు ఉదయం డోర్ టు డోర్ చెత్త సేకరణ, రోడ్ల స్వీపింగ్ చేయాలనీ, మధ్యాన్నం పూట కాలువలు క్లీనింగ్ మరియు గ్యాంగ్ వర్క్ పెట్టి పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. అంతేకాక నైట్ శానిటేషన్ పక్కాగా నిర్వహించాలని, కల్వర్టులు ఉన్న ప్రాంతాలలో తప్పనిసరిగా మెష్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సమావేశంలో సి.యమ.ఓ.హెచ్ డాక్టర్ అమృతం, యస్.ఈ నాగమల్లెస్వర రావు, ఈ.ఈ లు సుదరరామి రెడ్డి, కోటేశ్వర రావు, యస్.యస్ లు, ఎ.ఈ లు శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News