విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి కూటమి ఎన్నికల హామీగా కాపు కార్పొరేషన్ కీ ఒక సంవత్సరానికి మూడువేల కోట్ల చొప్పున కేటాయిస్తామని హామీ ఇచ్చింది కానీ ప్రస్తుత బడ్జెట్లో కాపు కార్పొరేషన్ కీ ఏవిధమైన కేటాయింపులు జరగలేదని కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలులో టిడిపి కూటమి ప్రభుత్వం ద్వంద్వ నీతిని, ద్వంద్వ విధానాలను పాటించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
రంగా అబ్బాయికి మేము న్యాయం చేస్తామని వై.సి.పి. నుండి టి.డి.పి.లోకి ఆహ్వానించారు, టిడిపిలోకి వారిని ఆహ్వానించి ఎంతకాలమైంది ఇంతవరకూ వారికి మీరు ఏమి న్యాయం చేశారని నిలదీశారు. శ్రీకృష్ణదేవరాయల జయంతి, వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.రిజర్వేషన్ల అమలుపై కాపు ఐక్యవేదిక స్పష్టమైన వైఖరి బీసీ లకు, ఓసీ లకు గాని ఇబ్బంది లేకుండా కాపు, తెలగా, బలిజ, ఒంటరి కులాల వారికి మహారాష్ట్రలో మరాఠాలకు అమలు చేస్తున్న మాదిరిగా 10% ప్రత్యేక రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికగా అమలు చేయాలి.
2004 సం.లో కాపులకు బి.సి. రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కాపులకు న్యాయం చేయలేదు సరికదా కాపు ఉద్యమం ద్వారా వచ్చిన జి.ఓ.నెం. 30లో ఉన్న ముస్లింలను వేరుచేసి అడగని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి, ఉద్యమం చేసిన కాపులకు తీరని ద్రోహం చేశారని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను చంద్రబాబునాయుడు నాటి నుండి నేటి వరకూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ని అడ్డం పెట్టుకొని కాపులలో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి 95% కాపుల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన టిడిపి కాపుల పట్ల యధేశ్చగా కులవివక్షను కొనసాగిస్తుందని తెలిపారు.
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కాపులకు ఒకసారి బి.సి. (ఎఫ్) ద్వారా 5 శాతం రిజర్వేషన్లని, మరోసారి ఈడబ్ల్యూఎస్ 10 శాతంలో కాపులకు 5శాతం సబ్ కోటా అని చాలా పకడ్బందీగా మోసం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు ఐక్యవేదిక నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News