-పి.జమలయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ట్రయల్ సీడ్ సాగును ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎటువంటి అనుమతులు లేకుండా రైతులతో లిఖితపూర్వకంగా ఒప్పందాలు చేసుకోకుండా ట్రయల్ సీడ్ ఇచ్చి మంచి దిగుబడి వస్తుందని మాయ మాటలు చెప్పి రైతులను మోసగిస్తున్న కంపెనీ యజమానులపై చట్టపురమైన చర్యలు తీసుకోవాలని పి.జమలయ్య కోరారు.
నేడు ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, విత్తనరైతుల సంఘం కన్వీనర్ బి.రాము,సిపిఐ మైలవరం మండలం కార్యదర్శి బుద్దవరపు వెంకట్రావు తదితరుల ప్రతినిధి బృందం ఎన్టీఆర్ జిల్లా మైలవరం డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కి వినతిపత్రం అంద జేసింది. ఈ సందర్భంగా పి.జమలయ్య మాట్లాడుతూ వ్యవసాయ శాఖ,రైతులు, సీడ్ ఇచ్చే కంపెనీ ప్రతినిధుల మధ్య లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకున్న తర్వాతే సీడ్ సాగును ప్రోత్సహించాలని, అలా ముందుకు రాని విత్తన కంపెనీలను రాష్ట్రంలో ఉత్పత్తి చేయకుండా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నాణ్యతలేని విత్తనాలను సాగు చేయటం వలన పెట్టుబడితో పాటు ఒక సంవత్సరం పాటు ఆ రైతు కుటుంబం పోషణకు అవసరమైన ఆదాయం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు.
రైతుకు రక్షణ లేకుండా సీడ్ సాగును ప్రోత్సహించరాదని వ్యవసాయ శాఖ ఆఫీసర్ కు విన్నవించారు.
ప్రతి సీజన్ లో రైతులకు మాయ మాటలు చెప్పి మోసగిస్తున్న సీడ్ ఆర్గనైజర్లను, వారి ఏజెంట్లను గ్రామాలు తిరగనీయ్య కుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సీడ్స్ కంపెనీ గుర్తింపుకార్డులు లేకుండా ట్రయల్ సీడ్ సాగును ప్రోత్సహిస్తున్న ఆర్గనైజర్లను, వారి ఎజెంట్ల పై కఠినంగా వ్యవహరించాలని కోరారు.
బయట మార్కెట్ లో సర్టిఫై సీడ్ మాత్రమే అమ్మేందుకు చర్యలు చేపట్టాలని,ట్రూత్ పుల్స్ సీడ్స్ కొనుగోలు చేయవద్దని, ఆ సీడ్ కు నాణ్యత గ్యారెంటీ లేదని అటువంటి సీడ్ కొనుగోలు చేసి మోసపోవద్దని రైతాంగాన్ని కోరారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి విత్తనాలు,పురుగు మందులు, ఎరువులు అమ్ముతున్న షాపులను తనిఖీ నిర్వహించాలని, నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అమ్ముతున్న వారిపై విత్తన చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాల పంటలకు అవసరమైన నాణ్యత కలిగిన విత్తనాలను పూర్తి సబ్సిడీతో అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు.
Prajavartha Online Telugu News