రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణ విజిలెన్స్ మరింత పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహా కిషోర్ లు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (NCORD) సమావేశానికి సమన్వయ కర్త గా ఎస్పి డీ నరసింహ కిషోర్, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, గంజాయి రెవెన్యూ, పోలీస్ మరియు ఎక్సైజ్ విభాగాలు సెమినార్లు, ప్రతిజ్ఞా ఉత్సవాలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు, క్రీడా కార్యకలాపాలు మరియు ఇతర కార్యకలాపాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల మనస్సు మరియు శరీరంపై కలిగే హానికరమైన ప్రభావాల గురించి లక్ష్య సమూహాలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహన కార్యక్రమాలలో మతపరమైన/సామాజిక/విద్యా/సహకార సంస్థలను మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడానికి సామాజిక కార్యకర్తలను కూడా పాల్గొనేలా చూడాలన్నారు. తల్లితండ్రులలో, సంరక్షకులతో వాటిపై, పిల్లల్లో ప్రవర్తన విషయంలో తేడాలు గుర్తించి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సమాజాన్ని, ముఖ్యంగా విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి అవగాహన ర్యాలీలు, సెమినార్లు, బహిరంగ సమావేశాలు మరియు ప్రతిజ్ఞ ప్రచారాలు నిర్వహించాలన్నారు. వివిధ సమన్వయ శాఖల అధికారులతో విజిలెన్స్ చేపట్టాలని, అందుకు సంబంధించి పోలీసు అధికారులు సహకారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా “ఇ-ప్రతిజ్ఞ” , అందులో పాల్గొనే వారికి ధృవీకరణ పత్రాలు జారీ చేయడం వలన ప్రజల్లో జాగృతి చెయ్యడం సాధ్యం అవుతుందని తెలిపారు.
జిల్లా ఎస్పీ డి నరసింహా కిషోర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల సంబంధిత నేరాల యొక్క చట్టపరమైన పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి చొరవ తీసుకోవాలని కోరారు. నివారణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన శిబిరాన్ని నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగం, వాటి వల్ల జరిగే అనర్థాలు పై బహిరంగ చర్చ జరగాలనీ , అప్పుడే ప్రజల్లో అవగాహన కల్పించడం సాధ్యం అవుతుందని తెలిపారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు వినియోగం, గంజాయి సరఫరా జరుగుతోందని సమాచారం తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు.
ఈ సమావేశం లో మాదక ద్రవ్యాలు వినియోగం వాటి వల్ల జరిగే అనర్ధాలు పై గోడ ప్రతులను ఆవిష్కరించారు.
Prajavartha Online Telugu News