గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ త్రాగునీటి సరఫరాలో ఇంజినీరింగ్ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. శుక్రవారం బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అనధికారికంగా త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా తరలించడం గమనించి, గతంలో హెచ్చరించినా పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఏఈ రవి కిరణ్ ని సరెండర్ చేయాలని, రిజర్వాయర్ సిబ్బంది శేషయ్య, నాగరాజులను విధుల నుండి తొలగించాలని ఎస్ఈ ని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ త్రాగునీటి సరఫరా అనధికార తరలింపుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా బిఆర్ స్టేడియం రిజర్వాయర్ ను తనిఖీ చేశారు. ట్యాంకర్ల వివరాలు నమోదు రిజిస్టర్ ని పరిశీలించి, రిజిస్టర్ లో వివరాలకు, నీటిని తరలిస్తున్న ట్యాంకర్ల వివరాలకు వ్యత్యాసం ఉండడంపై సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు రిజర్వాయర్ లో అనధికార నీటి తరలింపుపై గతంలో కూడా అందిన ఫిర్యాదుల మేరకు విధుల్లో సక్రమంగా ఉండాలని హెచ్చరించినా పని తీరు మార్చుకోని ఏఈని తన మాతృ శాఖకు సరెండర్ చేయాలని, సిబ్బందిని అప్కాస్ నుండి పూర్తిగా తొలగించాలని ఎస్ఈ ని ఆదేశించారు. నగరంలో రోజువారీ పర్యటనల్లో రిజర్వాయర్ తనిఖీలు చేస్తామని, త్రాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడవి తక్కెళ్లపాడు టిడ్కో గృహసముదాయాన్ని పరిశీలించి, త్రాగునీటి సరఫరాపై గత పర్యటనలో ఇచ్చిన ఆదేశాను పాటించని ఇంజినీరింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణం సదరు ప్రాంతానికి నీటి సరఫరా సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఆర్ఓబి మంజూరు అయినందున, పనులు ప్రారంభమైతే ప్రత్యామ్నాయంగా వెనిగండ్ల, ఆటో నగర్ రోడ్లను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్వీఎన్ కాలనీలో పలు ప్రాంతాల్లో చేపట్టిన రోడ్లు, డ్రైన్లను పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్నారు.
పర్యటనలో కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాం ప్రసాద్, షేక్ మీరావలి, డిఈఈలు నాగభూషణం, రమేష్ బాబు, ఎస్ఎస్ లు సోమశేఖర్, ఎన్విఎస్ ప్రసాద్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News