గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా రూ.20కే నాణ్యమైన గుడ్డ సంచులను అందించేలా ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చామని, అలాగే ప్రజలు తమ ఇళ్లల్లో ఉండే ప్లాస్టిక్ వ్యర్ధాలను 1కేజీ ఇస్తే గాంధీ పార్క్ లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని సదరు అవకాశాలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకొని పర్యావరణ హిత, క్లీన్ గుంటూరు సాధనలో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శుక్రవారం కమిషనర్ గాంధీ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన గుడ్డ సంచుల వెండింగ్ మెషిన్, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ పాయింట్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రజారోగ్యానికి భంగం కల్గించేలా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నియంత్రణకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రజలకు ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులను అందించే మెషిన్లను ప్రస్తుతం గాంధీ పార్క్ దగ్గర, ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. సదరు మెషిన్లలో రెండు రూ.10 నోట్లు లేదా కాయిన్స్ లేదా నాలుగు రూ.5 కాయిన్స్ వేస్తే సంచులు వస్తాయని తెలిపారు. అలాగే సంచులపై వ్యాపార సంస్థలు ప్రకటనలు ఇస్తే, రూ.10కే సంచులు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఇళ్లల్లో నిల్వ ఉన్న ప్లాస్టిక్ వ్యర్దాలను తొలగించేలా ప్రోత్సహించడానికి 1 కేజీ ప్లాస్టిక్ వ్యర్ధాలు ఇస్తే నగరపాలక సంస్థ గాంధీ పార్క్ లోకి ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణ, ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణకు గాంధీ పార్క్ దగ్గర ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నగర ప్రజలు సదరు సౌకర్యాలను అందిపుచ్చుకొని, గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
Prajavartha Online Telugu News