-వైసీపీ నాయకులపై మంత్రి సవిత ఫైర్
-ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం
-తక్షణమే ప్రసన్నకుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-తల్లిని, చెల్లెళ్లు గౌరవించని వ్యక్తి జగన్
-రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదు : మంత్రి సవిత
కడప, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీ రెడ్డితో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. జగన్ కు, వైసీపీ నాయకులకు మహిళలంటే గౌరవం లేదని, చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని ఆస్తుల కోసం ఇంటి నుంచి గెంటేయడమే కాకుండా కోర్టుకు ఈడ్చిన ఘనుడి జగన్ రెడ్డి అని అన్నారు. బాబాయ్ కూతురు, మరో చెల్లెలు సునీతను కూడా ఏడిపిస్తున్నాడన్నారు. ఇంట్లో ఆడవాళ్లను గౌరవించని జగన్.. రాష్ట్రంలో ఇతర మహిళలను ఏం గౌరవిస్తాడని అన్నారు. జగన్ సహా వైసీపీ నాయకులు సైతం రాష్ట్రంలో మహిళలపై నోరు పారేసుకుంటున్నారన్నారు. నిన్నటికి నిన్న అమరావతి రాజధాని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. నేడు మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి నోరు పారేసుకోవడం దారుణమన్నారు. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడడం బాధాకరమన్నారు. తక్షణమే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి వైసీపీ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ సతీమణి భారతీరెడ్డిపై పోస్టర్ వేశాడని ఐటీడీపీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, ఆయనపై కేసు కూడా నమోదు చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. రాజకీయాలకతీతంగా మహిళలను తాము, తమ ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. మహిళలను కన్నీరు పెట్టిస్తే రాజకీయంగానే కాకుండా నైతికంగా పతనమవ్వడం ఖాయమన్నారు. మహిళలను ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హెచ్చరించారు. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మాట్లాడుతూ, మహిళలను కించపరచడమే లక్ష్యంగా వైసీపీ ఆవిర్భవించిందన్నారు.
Prajavartha Online Telugu News