-రాష్ట్రంలోని 10వ తరగతి ఉర్దూ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
-79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 13,14తేదీలలో నిర్వహణకు ఏర్పాట్లు
-రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“భారత స్వాతంత్ర్య పోరాటంలో ఉర్దూ భాష పాత్ర” అనే అంశంపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఆగస్టు 15వ తేదీ 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తున్నట్లు మంగళవారం అమరావతి లో విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఏపీ ఉర్దూ అకాడమీ నేతృత్వంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, విద్యా శాఖల సంయుక్త నిర్వహణలో భారత స్వాతంత్ర పోరాటంలో ఉర్దూ భాష పాత్ర అంశంపై పోటీలను 13,14 వ తేదీలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులను నోడల్ అధికారులుగా నియమించి పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర రెండవ అధికారిక భాష ఉర్దూను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి మైనారిటీ సంక్షేమ శాఖ అమలు చేస్తున్న కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల నిర్వహణతో భాష అభివృద్ధి చెందడమే కాకుండా, ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులలో దేశభక్తి భావాలు కూడా పెంపొందుతాయని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛను స్వాతంత్రోద్యమంలో భారతీయుల ఐక్యతతో కూడిన పోరాటాలే మనందరికీ స్వతంత్ర ఫలాలను అందించాయన్నారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఉర్దూ భాష పాత్ర పై వ్యాసరచన, వక్తృత్వపోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు మొదటి, రెండవ, మూడవ బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News