-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ “ ప్రసాదం” పథకం క్రింద అన్నవరం దేవస్థానాన్ని రూ.48 కోట్లతో అభివృద్ది పరుస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. టెంపుల్ టూరిజం అభివృద్దిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ “ ప్రసాదం” పథకం క్రింద రాష్ట్రంలో పలు దేవస్థానాల్లో మౌలిక వసతుల అభివృద్దికై పలు దేవస్థానాలను ప్రతిపాదించడం జరిగిందని మంత్రి తెలిపారు. అయితే కేంద్రం ఆమోదించిన మేరకు ఇప్పటికే రూ.50 కోట్లతో శ్రీశైల దేవాలయం అభివృద్ది పనులను చేపట్టడం జరిగిందని, మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ది పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ప్రసాదం పథకం క్రింద అన్నవరం దేవస్థానం అభివృద్దికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ రూ.48 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇది ఎంతో శుభపరిణామమని రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్దికి ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా మరియు రాయలసీమ పర్యాటక సర్క్యూట్ల అభివృద్దికి తగుచర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, ఆయా సర్క్యూట్లలోని పర్యాటక ప్రాంతాల్లో రవాణా, కమ్యునికేషన్ సౌకర్యాల కల్పనతో పాటు మౌలిక వసతుల మెరుగుకు పలు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పర్యాటక సంస్థకు చెందిన సుమారు 15 హోట్లళ్లను, రెస్టారెంట్లను ఆధునీకరించేందుకు రూ.47 కోట్లను వెచ్చించడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా పర్యాటక సంస్థకు చెందిన 28 ప్రాపర్టీలను ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ విదానం క్రింద ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్లను పిలవడం జరిగిందన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు రకాల టూర్ ప్యాకేజీలను కూడా రూపొందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
పర్యాటక శాఖకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్లు పైబడి ఆదాయం రాగా, కోవిడ్ వల్ల అది 2020-21 లో రూ.74 కోట్లకు పడిపోయిందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.40 కోట్ల పైబడి ఆదాయం రావడం జరిగిందని, అయితే ఈ ఏడాది రూ.125 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యంతో తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News