-మెరుగైన విద్య వ్యవస్థ స్థాపనకు మంత్రి లోకేశ్ కృషి
-మరో 450 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేత
-రూ. 4.75 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన
-90 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
-ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర చరిత్రలో రాజకీయ రంగులతో సంబంధం లేకుండా పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫార్మ్, బెల్ట్, బ్యాగ్ అందించామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మెరుగైన విద్య వ్యవస్థను నెలకొల్పేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని తెలిపారు. గురువారం నాడు అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం కొప్పెరపాడు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు 430 సైకిళ్లను ఉచితంగా మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పాటు నెడ్ క్యాప్ సంస్థల సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందించామని అన్నారు. వీటితో పాటు మరో 9 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు మెగా డీఎస్సీ ద్వారా 16,300 కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం 90 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్వోసీలను అందజేశారు.
రూ. 4.75 కోట్లతో బీటీ రోడ్డు
బల్లికురవ మండలం కొత్తూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రూ. 4.75 కోట్ల వ్యయంతో కొప్పెరపాడు – జమ్మలమడక గ్రామాల మధ్య నిర్మించనున్న ఈ బీటీ రోడ్డు పూర్తయితే స్థానిక ప్రజల రాకపోకలు మరింత సులభతరం కానున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నియోజకవర్గంలో బీటీ రోడ్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కోరిన వెంటనే మంజూరు చేశారని గుర్తు చేశారు.
అనంతరం కొత్తూరులో వ్యవసాయ సహకార పరపతి సంఘం గోడౌన్‌లో ఎరువుల నిల్వలను మంత్రి గొట్టిపాటి స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారికి అవసరమైన ఎరువులు సమయానికి అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా సమయానికి ఎరువులు, విత్తనాలు అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News