-నిజజీవితంలో ఘటనలే నా స్వరాలు
-ప్రఖ్యాత సంగీత మాంత్రికుడు ఇళయరాజా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేను మాటల వాణ్ని కాదు.. పాటల వాణ్ని..అనీ మాటలు మాట్లాడటం కంటే నాకు పాటలు పాడటమే సులభం అనీ “నిజజీవితంలో జరిగిన ఘటనలు, పరిణామాలే నా స్వరాలనీ. వాటినే నేను పాటలుగా మార్చాను” అని
ప్రఖ్యాత సంగీత మాంత్రికుడు ఇళయరాజా అన్నారు.
ఈ నెల 8 న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ట్రెండ్ సెట్టర్ ఈవెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ సంబంధించి ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. తాను స్వరపరిచిన గీతాలను విన్నవారికి తమ జీవితాల్లో జరిగిన ఘటనలను గుర్తుకు చేసుకుంటారని, ఆ పాటతో ఆ సందర్భాలు ఆ జీవిత సంఘటనలు మనసులో ముద్రితమై ఉంటాయని వివరించారు. తనకు కళ్ళ ముందు కనిపించిన ప్రతి పరిణామాన్ని ఒక స్వరంగా మార్చానని అన్నారు. తాను సినిమా గీతాలకు స్వరాలను సమకూర్చేటప్పుడు గాయకులు, ఆర్కెస్ట్రా అంతా కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్లమన్నారు. ఏ వాయిద్య కారుడు వాయిద్యాన్ని ఎప్పుడు వాయించాలో నోట్స్ రాసి ఇచ్చేవాడినని తెలిపారు. రికార్డింగ్ సమయంలో ఎక్కడ చిన్న తప్పు దొర్లిన మళ్లీ రీ రికార్డింగ్ చేసేవాళ్ళమని అన్నారు. అంత ఖచ్చితంగా పాట వచ్చినప్పుడే దాన్ని బయటకు విడుదల చేసేవాళ్లమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకుల్లో చాలామంది తాము ఇళయరాజా అంతటి స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నారంటే అది దేవుడిచ్చిన వరంగా పేర్కొన్నారు. ఆ రోజుల్లో ఆమె రికార్డింగ్ చేసేటప్పుడు ఎన్ని గంటలకు రికార్డింగ్ చేసాము ఎక్కడ చేశాము ఎవరెవరు పాటలు పాడారు ఆర్కెస్ట్రా ఎవరు అన్న విషయాలను తెలియజేసే వాళ్ళమని వివరించారు. ఇప్పుడు పాట రాస్తున్న వారు ఎవరో పాడే వారికి తెలియడం లేదని ఆవేదన వ్యకం చేశారు. పాడేవారు కనీసం ఆర్కెస్ట్రా కూడా తెలియడం లేదని ఆర్కెస్ట్రా ఎవరో దర్శకులకు తెలియడం లేదన్నారు. గాయనీ గాయకులు ఒకరికొకరు తెలియని పరిస్థితి ఇప్పుడు ఉందన్నారు. మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్న ట్రెండ్ సెట్టర్స్ లైవ్ అధినేత సుధాకర్ మాట్లాడుతూ విజయవాడలో మొదటిసారిగా ఇళయరాజా మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళయరాజా వంటి సంగీత దర్శకులతో మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మనాభుని రవి, అంబటి శివ , మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News