విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆవకాయ్… సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం రెండో రోజు సాయంత్రం పున్నమిఘాట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులకు కొత్త మధురానుభూతులను అందించాయి. దుర్గమ్మ చల్లని నీడలో కృష్ణమ్మ చెంత సాంస్కృతిక సౌరభాల సంగమం సరికొత్త మాధుర్యానికి చేరువ చేసింది. కర్ణాటక, ఆధ్యాత్మిక సంగీత విభావరి మన సంప్రదాయ సాంస్కృతిక విశిష్టతను గుర్తుచేసింది. వనశ్రీరావు.. కూచిపూడి నృత్యం.. రస ఐక్యం ప్రేక్షకుల మదిలో పదిలమైన ముద్ర వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కలలకు కదలిక ఇచ్చే కళ సినిమాకు సంబంధించి పాటల రచన, సాహిత్యానికి సంబంధించి సినీ రంగ ప్రముఖులతో జరిగిన చర్చా గోష్టి ఆధునిక సినిమా సాహిత్య ధోరణులను కళ్లకుకట్టింది. గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తదితరులు కార్యక్రమాలకు హాజరై.. కళాకారులను అభినందించారు.
Prajavartha Online Telugu News