– వేస్ట్ పిక్కర్ల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు
– దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ద్వారా తోపుడు బళ్ల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ చేతుల మీదుగా ఆరుగురు వేస్ట్ పిక్కర్లకు తోపుడు బళ్ల రిక్షాలు పంపిణీ చేశారు. వేస్ట్ పిక్కర్ల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు రిసోర్స్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ రమాదేవి తెలిపారు. ఈ వాహనాల ద్వారా వారు స్వతంత్రంగా తమ జీవనోపాధిని కొనసాగించగలరని, ఆదాయం పెంపొందించుకునే అవకాశాలు విస్తరించనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ, లబ్ధిదారులు తమ పిల్లలను బాగా చదివించుకుని, చిన్న వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని స్థిర నివాసాలను ఏర్పరుచుకోవాలని కోరారు. అవసరమైన సహాయం, మార్గదర్శకత ఎప్పటికప్పుడు అందిస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. రమేష్, అనిత, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News