-పాల కల్తీపై తక్షణ విచారణ జరపాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి మతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్ప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, పాల కల్తీపై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. రాజమండ్రిలో వరుసగా జరుగుతున్న అనూరియా కారణమైన మరణాలు అత్యంత బాధాకరమైనవి. కల్తీ పాలు తాగి 4 గురు మృతి చెందారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికరం. రాష్ట్ర ప్రభుత్వం ఈ మరణాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారాన్ని అసెంబ్లీలో ప్రకటించింది. కాని మతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్ప్పున పరిహారం చెల్లించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ యంత్రాల కొరత, నిపుణులైన వైద్యుల లేమి కారణంగా కిడ్నీ బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మందులు, పరీక్షలు లేకపోవడం వంటి కారణాలతో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను విస్మరించి, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం దుర్మార్గం.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాల కల్తీ విస్తృతంగా జరుగుతోందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కల్తీ పాలు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ, కిడ్నీ వ్యాధులకు కారణమవుతున్నాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, పాల కల్తీపై, అనూరియా మరణాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలలని డిమాండ్ చేస్తున్నాం. బాధితులకు ఉచిత, నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని, రాజమండ్రిలో ప్రత్యేక కిడ్నీ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News