– నిబద్ధతతో డేటా సేకరణ విధులు నిర్వర్తించాలి
– ప్రతి విషయంపైనా స్పష్టత అవసరం
– జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :’
జన గణన అనేది దేశ ప్రగతికి సరికొత్త మైలురాయి అని.. నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ డేటా సేకరణ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు.
శుక్రవారం విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలలో సెన్సస్-2027కు సంబంధించి తొలిదశ (హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్)పై జిల్లా సెన్సస్ అధికారులు, ఛార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మార్చి 1 వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెన్సస్ ప్రాధాన్యత, సమాచార సేకరణ విధివిధానాలు, మొబైల్ యాప్స్‌తో పాటు వివిధ డిజిటల్ వేదికలు, ప్రత్యేకంగా కేటాయించిన విధులపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అప్పుడే ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా స్వచ్ఛమైన డేటా సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ (హెచ్ఎల్‌వో), రెండో దశ పాపులేషన్ ఎన్యూమరేషన్ (పీఈ) అని వివరించారు. ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. విధాన అభివృద్ధి, సామాజిక అవసరాలను సరైన విధంగా అర్థం చేసుకునేందుకు జన గణన ముఖ్యమని.. కచ్చితమైన ప్రణాళిక, వనరుల కేటాయింపునకు కీలకమన్నారు. అందువల్ల ఈ బహత్తర కార్యక్రమంలో పాల్గొనే ప్రతిఒక్కరూ అంకితభావంతో సేవలందించాలని జేసీ ఇలక్కియ సూచించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, సెన్సస్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ జి.ప్రసన్నకుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఎస్‌వోలు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News