– ఎన్టీఆర్ జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) ఆధ్వర్యంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారి మార్గనిర్దేశనంతో ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌పై విస్తృతంగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు తెలిపారు.
శుక్రవారం సూరంపల్లిలోని సీఐపీఈటీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి మధు మాట్లాడుతూ శుక్రవారం తిరువూరు, ఎ.కొండూరులో కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించినట్లు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని సాకారం చేసే దిశగా సమష్టి కృషి అవసరమన్నారు. ఎంఎస్ఎంఈల స్థాపన, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సొంతగా యూనిట్లు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించగల స్థాయికి యువత ఎదగాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమలు స్థాపించాలని పరిశ్రమల అధికారి ఎం.మధు విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఏడీ ఎస్.బాలసుబ్రహణ్యం, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు పి.మనీషా, ఆర్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News