-దేశంలో తొలిసారిగా విద్యుత్ చార్జీలను 13 పైసలు ట్రూ డౌన్ చేశాం
-వైసీపీ పెంచిన ఛార్జీలపై వాళ్లే ధర్నాలు, అసెంబ్లీలో ప్రశ్నలు
-కూటమిపై దుష్ప్రచారాలను నేతలే తిప్పి కొట్టాలి
-ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు దేశంలోనే తొలిసారిగా విద్యుత్ చార్జీలను 13 పైసలు తగ్గించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రజా సంక్షేమమే పరమావధిగా అర్హులైన వారందరికీ సంక్షేమ పెన్షన్లను అందిస్తుందని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి శుక్రవారం నాడు పర్యటించారు. ముందుగా వినుకొండ పట్టణం పదో వార్డు ఏబీఎం కాంపౌండ్ లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. కొత్తగా పెన్షన్ అందుకున్న మహిళతో మంత్రి గొట్టిపాటి మాట్లాడి ధైర్యాన్ని ఇస్తూ… ఆమె ఆనందంలో భాగం పంచుకున్నారు. బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం రూ.1.85 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి గిరి ప్రదక్షిణ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. వినుకొండ పట్టణంలో రూ.5 కోట్లతో నిర్మించే 33\11 కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ కు కూడా ఆయన భూమి పూజ చేశారు. ఆ తరువాత వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రారంభించారు. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండల పరిధిలోని కొండ్రముట్ల – కనమర్లపూడి గ్రామాల మధ్య రూ.2.50 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
వినుకొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క రూపాయి విద్యుత్ బిల్లుల భారం ప్రజలపై వేయలేదన్నారు. ఎటువంటి ఛార్జీలు పెంచలేదని, ఇకపైనా పెంచబోమని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో వేలాది కోట్ల రూపాయిలు విద్యుత్ భారాలను ప్రజలపై మోపారని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ చేసిన భారాలను కూటమి ప్రభుత్వంలో 13 పైసలు ట్రూ డౌన్ చేశామని తెలిపారు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నచందంగా వైసీపీ నేతల తీరు ఉందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వైసీపీ నాయకులే ధర్నాలు చేయడం, వైసీపీ మోపిన రూ.25,000 కోట్ల విద్యుత్ భారాలపై అసెంబ్లీలో వాళ్లే ప్రశ్నలు అడగడాన్నిఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను ఎక్కడికక్కడ నేతలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తాజాగా పెట్రోల్ లభ్యతపైనా దుష్ప్రచారాలు చేశారని మంత్రి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తెచ్చిన పెట్టుబడులను కూడా తామే తెచ్చామన్నారని, స్టీల్ ప్లాంట్ ను కూడా వైసీపీనే తెచ్చిందని చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి వాటిపై కూటమి ధీటుగా సమాధానం చెప్పిందన్నారు. స్థానిక నేతలు కూడా ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లాతో పాటు వినుకొండ నియోజకవర్గంలో మొత్తం 26 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పీఎం సూర్యఘర్ కనెక్షన్లను మంజూరు చేశామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మూడు నెలల్లోపు రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ ఎస్ఈ కూడా గడువులోపు సోలార్ కనెక్షన్లను పూర్తి చేయించాలని సూచించారు. సోలార్ రూఫ్ టాప్ యూనిట్లతో ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. దీని వలన అన్ని వర్గాల వారికీ లాభమేనని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. 3 కేవీ సోలార్ కనెక్షన్ తీసుకునే బీసీలకు 98 వేలు, ఓసీ వర్గాలకు 78 వేలు సబ్సిడీ ఉందన్నారు. వినుకొండ పట్టణంలో ఆరు నెలల్లో పూర్తి కానున్న సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ తో లో ఓల్టేజ్ సమస్యలను ఉండవన్నారు. వినుకొండ నియోజవర్గంలో ఆర్డీఎస్ఎస్ కింద 12 ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వీటిలో 6 ఫీడర్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర సంయుక్త సహకారంతో ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాలను అమలు చేయడంతో పాటు సబ్ స్టేషన్ల నిర్మాణం కూడా ఏక కాలంలో చేపడుతున్నామని వివరించారు. లో ఓల్టేజ్, అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆ దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News