విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వ పాలనలో హిందూ దేవాలయాలకు గ్రహణం పట్టిందని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. మంగళవారం వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 2 లక్షల ఎకరాల దేవాదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి సచివాలయం సాక్షిగా ఈ భూముల అన్యాక్రాంతం గురించి అంగీకరించారని చెప్పారు. అయోధ్య రామాలయ నిధుల గోల్‌మాల్ కంటే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న భూముల స్కాం చాలా పెద్దదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతి, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులు మరణించడం, శ్రీకూర్మంలో తాబేళ్లు, తిరుపతిలో గోవుల మృతి వంటి అపచారాలు ఎన్నో జరుగుతున్నాయని, విజయవాడ దసరా ఉత్సవాలను సైతం వ్యాపారంగా మార్చేశారన్నారు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 వేల ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలు, అర్చకుల వేతనాలు పెంచారన్నారు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టింది జగన్ మోహన్ రెడ్డి కాదా అన్నారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి సాయిబాబాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మాధవ్‌లు ఆలయ భూముల దోపిడీపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాగం నడుస్తుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జగన్ మోహన్ రెడ్డి కి హిందూ దేవాలయమీద నమ్మకం ఉంది కాబట్టే ఒంగి నమస్కారం చేస్తారన్నారు. దేవాదాయ భూములు దోచుకుంటుంటే స్వామిజీలు ఎందుకు మాట్లాడం లేదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు,
Prajavartha Online Telugu News