Breaking News

​జూన్ 30 నుంచి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ‘ఛాత్రోం కీ గూంజ్’ ఉద్యమం..

-యువత కలలను ఛిద్రం చేస్తున్న కేంద్ర విధానాలపై కాంగ్రెస్ సమరం
-ఏఐసీసీ అధికార ప్రతినిధి రాగిణి నాయక్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు ఉదంతాలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ మండిప‌డ్డారు. భ‌విష‌త్ డాక్ట‌ర్ల‌ను నిర్ణ‌యించే నీట్ పేపర్ లీకేజీలకు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జూన్ 30 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభ‌మయ్యే ఛాత్రోం కీ గూంజ్ ఉద్యమంలో భాగంగా గురువారం నాడు విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన డాక్ట‌ర్ రాగిణి నాయ‌క్, గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్ల‌బ్ లో ఛాత్రోం కీ గూంజ్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించి మీడియాతో మాట్లాడారు. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీ ఏ) ను పూర్తిగా రద్దు చేయాలని ఆమె ఈ సంద‌ర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పేపర్ లీకేజీల వల్ల కోట్లాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యువ‌త‌, విద్యార్థుల బాధ‌ల‌ను, భ‌యాల‌ను అర్థం చేసుకోవాలంటే స్పందించే గుండె కావాలని, అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదని ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి రాగిణి విమర్శించారు. భారతదేశంలో 65 శాతం జనాభా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతే అని గుర్తు చేశారు. ఇంతటి అపారమైన యువ శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగించాల్సింది పోయి, మోదీ ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ చేతకానితనంతో పరీక్షల కుంభకోణాలు, ప్రైవేటీకరణ, అధిక ఫీజుల వంటి సమస్యల వలయంలోకి విద్యార్థులను నెట్టేస్తున్నారన్నారు. గత పదేళ్లలో దేశంలో దాదాపు 89 పేపర్లు లీక్ అయ్యాయని, దీనివల్ల 6.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని స్ప‌ష్టం చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు 64 ప్రధాన పరీక్షల పేపర్లు లీక్ కాగా, అందులో 45 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలే ఉన్నాయ‌న్నారు. దీనిని దేశ ప్ర‌జ‌లంద‌రూ గ‌మ‌నించాల‌న్నారు.
డైవర్షన్ పాలిటిక్స్.
​ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేప‌ర్ లీక్ వ‌ల‌న 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ రాగిణి నాయ‌క్, తెలిపారు. పేపర్ లీక్ అయి, సిబిఐ విచారణ జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా చిన్న, చిన్న ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న యువ‌త‌ డిమాండ్ చేస్తుంటే, దాన్ని డైవ‌ర్ట్ చేయ‌డానికి టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో సైన్యం, వాయుసేన సహాయం లేకుండా ఒక పోటీ పరీక్షను కూడా ప్రశాంతంగా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో మోదీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. పరీక్షల నిర్వహణలో బయోమెట్రిక్ లోపాలు, అడ్మిట్ కార్డుల తప్పులు, సెంటర్ల కేటాయింపుల్లో అలసత్వం వల్ల విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డాక్ట‌ర్ రాగిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ​ఈ నేపథ్యంలోనే దేశంలోని యువ‌త‌, విద్యార్థుల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ జూన్ 30 నుంచి దేశవ్యాప్తంగా ‘ఛాత్రోం కీ గూంజ్’ (విద్యార్థుల గళం) పేరిట ఒక భారీ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు రాగిణి నాయక్ ప్రకటించారు. ఈ ప్రచారం దేశంలోని 28 ప్రధాన నగరాల్లో ఒకేసారి ప్రారంభమై, 40 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,నాయకత్వంలో కోటాలో జరిగిన విద్యార్థుల సదస్సుకు వేలాదిగా యువత తరలివచ్చారని, ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను ఎంపిక చేసేదిగా కాకుండా వారిని బయటకు నెట్టేసే ‘రిజెక్షన్ సిస్టమ్’లా మారిందని రాహుల్ గాంధీ అన్న మాటలను ఆమె ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. విద్యార్థుల‌తో పాటు త‌ల్లిదండ్రుల‌కూ న‌ర‌కం. 3000 మంది పరీక్ష రాస్తే కేవలం ఒక్కరు మాత్రమే ఐఏఎస్ అయ్యే ప్రస్తుత పరిస్థితుల్లో, విద్యార్థుల గొంతుకను కేంద్ర ప్రభుత్వానికి వినిపించేందుకే ఛాత్రోం కీ గూంజ్ ఉద్యమాన్ని చేపడుతున్నామని డాక్ట‌ర్ రాగిణి నాయ‌క్ ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీ త‌రుపున‌ అన్ని విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లను సంద‌ర్శించ‌డంతో పాటు అంద‌రు విద్యార్థులనూ కలిసి వారిని చైతన్యపరుస్తామని ఆమె స్పష్టం చేశారు. జూన్ 30 నుండి 28 ప్ర‌ధాన‌ నగరాలలో కరపత్రాల పంపిణీ, విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జులై నెలలో క్యాంపస్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్స్ తో పాటు అంబేద్కర్ సంభాషణలు జరుగుతాయన్నారు. ఆగస్టు 1న దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాలలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. ఆగస్టు 9వ తేదీన న్యూఢిల్లీలో భారీ ఎత్తున పార్లమెంటును ముట్టడించనున్నట్లు ఆమె ప్రకటించారు. అనంత‌రం మాజీ ఎమ్మెల్సీ, ఏపీసీసీ మాజీ అధ్య‌క్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ., ప్రధాని న‌రేంద్ర‌ మోదీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు కేంద్ర ప్రభుత్వంతో అలుపెరగని పోరాటం చేస్తామని రుద్ర‌రాజు తెలిపారు. ఆ త‌రువాత నీట్ విద్యార్థి మాట్లాడుతూ నీట్ ప్రవేశ పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా తాము కష్టపడి చదివిన చదువు వృధా అయ్యింద‌ని ఆవేదన వ్యక్తం చేశారు నెలరోజుల వ్యవధిలో మరోసారి పరీక్షకు ఎలా సిద్ధమవుతామని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా తీవ్ర మానసిక వేద‌న‌, ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వ‌లి, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి నాగ‌మధు యాద‌వ్, ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, రామారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నేత‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *