Breaking News

తోతాపురి మామిడి రైతుల సమస్యలపై ఐసీఏఆర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు

– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం సమస్యను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోతాపురి మామిడి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారని మంత్రి తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర మంత్రి, ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ కమిటీలో ఐసీఏఆర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తోతాపురి మామిడి సాగు ప్రాంతాలను సందర్శించి రైతులు, పల్ప్ పరిశ్రమలు, ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), ప్రభుత్వ అధికారులతో చర్చించి సమస్యల మూలాలను అధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన సూచనలు అందించనుందని చెప్పారు. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, అవసరమైన సమాచారం, సమన్వయం కల్పించి త్వరితగతిన నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తుండటంతో తోతాపురి మామిడి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తోందని, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంపై ఇదే విధంగా చొరవతో చర్యలు కొనసాగిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *