Breaking News

ప్రముఖ సంస్థలతో ఉక్కు రాష్ట్రంగా ఏపీ

-జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌తో రాయలసీమకు నవశకం
-2028లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి
-కియా అభివృద్ధికి… బ్రాహ్మణీ స్టీల్స్‌ అవినీతికి నిదర్శనం
-అనంత నుంచి 90 దేశాలకు కియా కార్ల ఎగుమతి
-బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో ఐరన్ ఓర్ దోపిడీ, విదేశాలకు స్మగ్లింగ్
-సున్నపురాళ్లపల్లిలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
-జేఎస్‌డబ్ల్యూ నియోఎనర్జీ, విజయనగరంలో పారిశ్రామిక ప్లాంట్‌కు శంకుస్థాపన

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమలు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌తో రాయలసీమకు నవశకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం సహా, ఆర్సెల్లార్ మిట్టల్, వైజాగ్ స్టీల్‌తో ఆంధ్రప్రదేశ్ ఉక్కు రాష్ట్రంగా మారుతుందని ఆయన అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపు రాళ్ల పల్లిలో జిందాల్ సౌత్ వెస్ట్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. జేఎస్‌డబ్ల్యూ చైర్మన్, సీఎండీ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మలతో కలిసి సీఎం ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. రాయల సీమ స్టీల్ ప్లాంట్‌తో పాటు అనుబంధంగా నిర్మిస్తున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులూ సీఎం ప్రారంభించారు. ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానుంది. ఉక్కు ఉత్పత్తి, సోలార్ ప్రాజెక్టు ద్వారా 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 3,850 మెగావాట్ల సామర్ధ్యంతో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేసేలా నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. రూ.20,350 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. జమ్మలమడుగు నుంచి విజయనగరం జిల్లాలోని జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కును కూడా సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో 1,166 ఎకరాల్లో అత్యాధునిక పారిశ్రామిక పార్కును జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.531 కోట్లను జిందాల్ సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.

దశాబ్దల నిరీక్షణ నిజమైంది

రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ..”రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి దశాబ్ద కాలం పాటు ఎదురు చూశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేరింది. రాయలసీమ అంటే ఇప్పుడు హార్టికల్చర్, అరుదైన ఖనిజాలు, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్- రాయల్ ఎన్ ఫీల్డ్. కియాకార్లు, హీరో బైక్స్ , డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ. సీమ ఇకపై ఏమాత్రం కరువు నేల కాదు, జలకళ ఉట్టిపడే పచ్చని ప్రాంతం. పరిశ్రమలు, రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో ఓ నవ శకం మొదలైంది. విభజన తర్వాత ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, అనుమానాలు దాటుకుని రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం. గత పాలకులు మోసపూరితంగా శంకుస్థాపనలు చేశారు. 2019లో ఓసారి, 2023లో మరోమారు శంకుస్థాపన, భూమి పూజలు చేశారు. ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టాం. పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో ఉక్కు ఉత్పత్తి చేస్తారు. విశాఖ ఉక్కు సంక్షోభంలో ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి రూ.11,440 కోట్ల ఆర్ధిక సాయంతో ఆదుకున్నాం. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. జేఎస్‌డబ్ల్యూ బళ్లారి ప్లాంట్ కంటే అధిక సామర్ధ్యంతో రాయలసీమ ప్లాంట్‌ను తీర్చిదిద్దాలి. గండికోట నుంచి 15 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి 2 టీఎంసీల నీటిని స్టీల్ ప్లాంట్ కు సరఫరా చేస్తాం. రాయలసీమ ప్రాంతంలో ఉన్న అత్యంత నాణ్యమైన ముడి ఇనుము ఖనిజాన్ని కూడా ప్లాంట్ కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం “అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

గత పాలనలో రాయలసీమ నష్టపోయింది

రాయలసీమ ఎవరి వల్ల నష్ట పోయిందో ప్రజలు గుర్తించాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. “దేశవ్యాప్తంగా పోటీ ఉన్నా 2017లో అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమను తీసుకువచ్చాం. 536 ఎకరాలను కేటాయించి, నీళ్లు ఇచ్చి ఉత్పత్తికి అన్ని విధాలా సహకరించాం. మేం తెచ్చిన కియా కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. ఇందులో 3 లక్షల కార్లు 90 దేశాలకు పైగా ఎగుమతి అయ్యాయి. కియాతో అనంతపురం దశదిశా మారింది. గతంలో కొందరు స్వార్థపరులు కేవలం సొంత ప్రయోజనాల కోసమే పనిచేసి అక్రమాలు చేశారు. 2007లో 14 వేల ఎకరాలను బ్రహ్మణీ స్టీల్స్ కు భూములు ఇచ్చి భ్రమలు కల్పించారు. ఎయిర్ పోర్టు కడతామని అన్నారు. ఇప్పటి వరకూ అతీగతి లేదు. క్యాప్టివ్ మైనింగ్ అని చెప్పి ఓబుళాపురం గనుల నుంచి దోపిడీ చేశారు. ముడి ఇనుము ఖనిజాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేశారు. అసలు ప్లాంటే పెట్టలేదు. దేశానికి ఉపయోగపడాల్సిన సంపద విదేశాలకు తరలిపోయింది. తప్పు చేసిన వ్యక్తులు జైలుకు వెళ్లారు. ఈ ఒక్క ఉదాహరణతోనే ఎవరిది విశ్వసనీయతో, ఎవరు మోసగాళ్లో అర్ధం అవుతుంది. రాయలసీమ సంపద ఈ ప్రాంత అభివృద్ధికే ఉపయోగపడాలి. ఇక్కడి ముడి ఇనుముతో ఇక్కడే ఉక్కు తయారు కావాలి. రాష్ట్రానికి చెందిన యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కడప జిల్లాకు, రాయలసీమకు ఏమీ చేయలేదు.” అని సీఎం అన్నారు.

విశ్వసనీయత లేని పార్టీకి విలువెక్కడ

‘గత పాలకులు రాయలసీమలో ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేక పోయారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ త్వరలోనే ఇస్తాం. సాగునీరు, తాగునీటి అవసరాలు తీరుస్తాం. అవుకు టన్నెల్ పూర్తి చేసి పులివెందులలో చీని తోటలు కాపాడాం. ఎర్రబెల్లి చెరువుకు నీళ్లు ఇచ్చి రైతుల కష్టాలు తీర్చాం. సీమలో స్పేస్, ఏరో స్పేస్, డిఫెన్సు, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తున్నాయి. స్పేస్ సిటీలో, డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు జేఎస్‌డబ్ల్యూ ముందుకు వచ్చింది. నమ్మకంతో, విశ్వాసంతో పాలన అందిస్తున్నాం కాబట్టే పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలు ఆడుకోవద్దని చెబుతున్నాను. గత పాలనలో మన రాజధాని ఏమిటో ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితి. వారికి విశ్వసనీయతే లేదు. నిన్న మావిగన్ అన్నారు. నేడు విజయవాడ అంటున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు. మూడు ముక్కల ఆటతో రాష్ట్రాన్ని, ప్రజల్ని తీవ్రంగా నష్ట పరిచారు. ప్రజలంతా కాలరెత్తుకుని చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేస్తాం. హింస, నేరాలతో కాదు.. ప్రజల కోసం బాధ్యతగా రాజకీయాలు చేయాలి. విజయవాడ యువకుడి అదృశ్యం ఘటనను కూడా రాజకీయం చేసేలా వైసీపీ వ్యవహరిస్తోంది. పోలీసులు ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. విధ్వంసమే గొడ్డలి పార్టీకి అజెండా. గంజాయి బ్యాచ్ విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించాను. మా హయాంలో శాంతిభద్రతలకే పెద్ద పీట. అలాగే, హార్టీకల్చర్ సాగుతో లింగాల మండలంలో రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం వస్తోంది. ఆగస్టు 15 నాటికి గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్‌కు మదనపల్లిలో శంకుస్థాపన చేస్తాం. రాయలసీమ హార్టీకల్చర్ హబ్ కోసం పూర్వోదయ పథకం కింద రూ.40 వేల కోట్లు వ్యయం చేస్తాం. ప్రైవేటు రంగం నుంచి మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. అమెరికాలో ఉన్న గ్రాండ్ కాన్యాన్‌కు ధీటుగా మన గండికోటను అభివృద్ధి చేస్తాం.’ అని సీఎం వ్యాఖ్యానించారు.

విజనరీ నేతతో పనిచేయటం గౌరవం- సజ్జన్ జిందాల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకులు దేశంలో చాలా అరుదుగా ఉన్నారని జిందాల్ సౌత్ వెస్ట్ లిమిటెడ్ చైర్మన్, సీఎండీ సజ్జన్ జిందాల్ అన్నారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్, నియో ఎనర్జీ ప్లాంట్, విజయనగరం పారిశ్రామిక పార్కు పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే 25 ఏళ్లలో చేయాల్సిన పనుల గురించి చంద్రబాబు ముందుచూపుతో ఆలోచన చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి కోసం నిత్యం పనిచేసే చంద్రబాబు లాంటి నేతలతో కలిసి పనిచేయటం పారిశ్రామిక వేత్తగా తనకు గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదికి 2 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నిర్మితం అవుతున్న రాయలసీమ స్టీల్ ప్లాంట్‌ను మరింతగా విస్తరిస్తామని తెలిపారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో స్థానిక యువతీ యువకులకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తరపున దాదాపు రూ.50 వేల కోట్ల మేర ఏపీలో పెట్టుబడులు పెడతామని.. ఈ పెట్టుబడులతో 50 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అంతకుముందు స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను, మినియేచర్ మోడళ్లను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు గురించి సజ్జన్ జిందాల్ సీఎంకు వివరించారు. దీని సమీపంలో పర్యాటక రిసార్టును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ ప్లాంట్ లో తమ సంస్థ రూపొందించిన డిఫెన్స్ డ్రోన్ షీల్డ్ ఏఐ గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి తిరుపతి స్పేస్ సిటీ సహా కర్నూలు డ్రోన్ సిటీలో వసతులను వినియోగించుకోవాలని కోరారు. ప్రకృతి విపత్తులు, డిఫెన్స్ అవసరాల కోసం వినియోగించే ప్రత్యేక వాహనాన్ని జిందాల్‌తో కలిసి సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *