-రోగ నిర్ధారణ సామర్ధ్యం పెంపు, తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్య రక్షణ, ఎమెర్జెన్సీ సేవల పటిష్టత లక్ష్యం
-20 కేటగిరీల్లో 582 పరికరాల కొనుగోలుకు ఆమోదం
-సమకూరనున్న 235 ఐసియూ వెంటిలేటర్లు, క్షయ వ్యాధి నిర్ఱారణకు 100 పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు
-కొనుగోలుకు బియఫ్‌సి ఆమోదం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చే ప్రక్రియలో భాగంగా వైద్యారోగ్య శాఖ రూ.61 కోట్ల వ్యయంతో వివిధ వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. వ్యాధి నిర్ధారణ సామర్ధ్యాన్ని పెంచేందుకు, తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు, ఎమెర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ సేవలను మరింత పటిష్టం చేసేందుకు 20 రకాలకు చెందిన 582 వైద్య పరికరాలను గతంలో పిలిచిన టెండర్ల ద్వారా కొనుగోలు చేసేందుకు మంత్రిత్వ శాఖకు చెందిన బిడ్ ఫైనలైజేషన్ కమిటీ(బిఎఫ్‌సి) శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది.
సమకూరనున్న పరికరాల వివరాలు
బిఎఫ్‌సి ఆమోదం మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఈ) ఆసుపత్రుల్లో రూ.27 కోట్ల వ్యయంతో కీలకమైన 235 ఐసియూ వెంటిలేటర్లు సమకూరనున్నాయి. నవజాత శిశువుల ఆరోగ్య భద్రత కోసం డిఎంఈ ఆసుపత్రులకు రూ.11.50 కోట్ల వ్యయంతో 38 నియోనేటల్ వెంటిలేటర్లు లభించనున్నాయి. క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా క్షయ వ్యాధి పరీక్షల కోసం రూ. 22 కోట్ల వ్యయంతో ఏఐ ఆధారంగా పనిచేసే 100 పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే మెషీన్లను కొనుగోలు చేయనున్నారు.
రూ. 70 లక్షల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరెటరీల కోసం 26 ఆటోమెటిక్ హెమటాలజీ ఎనలైజర్లు, క్రిటికల్ కేర్ బ్లాకుల కోసం రూ. 1కోటి వ్యయంతో వివిధ పరికరాలు, రూ. 30 లక్షల వ్యయంతో ఐ బ్యాంకుల కోసం వివిధ పరికరాలు, ఔషధ నాణ్యత పరీక్షల కోసం రూ. 70 లక్షల వ్యయంతో స్పెక్ట్రో మీటర్లు మరియు సెమీ మైక్రో ఎనలిటికల్ వెయింగ్ పరికరాలను కొనుగోలు చేసేందుకు బిఎఫ్‌సి ఆమోదించింది.
వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శ్రీ జి. వీరపాండియన్ అధ్యక్షతన పలువురు ఉన్నతాధికారులతో కూడిన బిఎఫ్‌సి ఈమేరకు వైద్య పరికరాల కొనుగోలును ఆమోదించింది.
Prajavartha Online Telugu News