-నాణ్యమైన మందులే ప్రజారోగ్యానికి రక్షణ
-విధివిధానాల అమలు, ప్రయోగశాల నియంత్రణలో పటిష్ఠత అవసరం
-యూఎస్ ఎఫ్‌డీఏ ఇండియా కార్యాలయం కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఔషధ తయారీ సంస్థల్లో జరిగే ప్రతి తనిఖీ, ప్రయోగశాల పరీక్ష, నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా కార్యాలయం (యూఎస్ ఎఫ్‌డీఏ ఇండియా ఆఫీస్ – US FDA India Office) కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని కాపాడాలంటే శాస్త్రీయ విధానాలు, అంతర్జాతీయ సహకారం, నాణ్యమైన తనిఖీ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని చెప్పారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన (ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ – AP DCA) ఆధ్వర్యంలో అమెరికా ఫార్మకోపియా (యూఎస్‌పీ – USP), ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIDCOC) సహకారంతో విజయవాడలో శుక్రవారం “నాణ్యమైన ఔషధాల భరోసా.. నియంత్రణ, ప్రమాణాలు, తనిఖీల్లో శాస్త్రీయ విధానం” అంశంపై జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
భారత్ కీలక భాగస్వామి….
అమెరికా ఎఫ్‌డీఏ పర్యవేక్షణలో ఉన్న ఔషధ తయారీ కేంద్రాల్లో సగానికి పైగా అమెరికా వెలుపలే ఉన్నాయని, అందులో భారత్ అత్యంత కీలక భాగస్వామి అని గ్రెగరీ స్మిత్ తెలిపారు. అమెరికాకు ఎగుమతి అయ్యే మందుల తయారీలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ – US FDA) ఆమోదం పొందిన 119 ఔషధ తయారీ కేంద్రాలు ఉండటం ఏపీ ఫార్మా రంగ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
లోపాలపై అప్రమత్తంగా ఉండాలి
అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీల్లో సాధారణంగా విధివిధానాలను సరిగా రూపొందించకపోవడం లేదా పాటించకపోవడం, లోపాలపై సమగ్ర విచారణ జరపకపోవడం, ప్రయోగశాల నియంత్రణల్లో బలహీనతలు కనిపిస్తున్నాయని గ్రెగరీ స్మిత్ తెలిపారు. ఇవి ఔషధ నాణ్యతను ప్రభావితం చేసే కీలక అంశాలని, తనిఖీల్లో శాస్త్రీయ ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నాణ్యతపై రాజీ లేదు: వీరపాండియన్
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడుతూ, వ్యాపార నిర్వహణ సులభతరం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – Ease of Doing Business) కోసం నిబంధనలను సరళీకరిస్తున్నప్పటికీ, మందుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నందున ఔషధ నియంత్రణ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ఔషధ తయారీ సంస్థల తనిఖీలు, ఉత్పత్తుల ప్రమాణాల పరిశీలన, ముడి పదార్థాల ధ్రువీకరణ, శాస్త్రీయ ఆధారాలతో నియంత్రణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అధికారులు మరింత పెంపొందించుకోవాలని సూచించారు. నాణ్యమైన మందులు తయారుచేసే సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, నాసిరకం మందుల విషయంలో మాత్రం ‘జీరో టాలరెన్స్’ విధానమే అమలు చేస్తామని స్పష్టం చేశారు.
శాస్త్రీయ ప్రమాణాలే ప్రజల విశ్వాసానికి పునాది
అమెరికా ఫార్మకోపియా (యూఎస్‌పీ – USP) ఇండియా సైట్ హెడ్ డాక్టర్ గిరీష్ కపూర్ మాట్లాడుతూ, మందుల నాణ్యత అంటే రోగుల విశ్వాసమని పేర్కొన్నారు. శాస్త్రీయ ప్రమాణాలు, శిక్షణ, అంతర్జాతీయ భాగస్వామ్యంతో నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు యూఎస్‌పీ కట్టుబడి ఉందన్నారు. ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIDCOC) డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, ఫార్మా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నియంత్రణ అధికారులకు నిరంతర శిక్షణ అవసరమన్నారు.
ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీ డీసీఏ – AP DCA) డైరెక్టర్ ఎం. పాండురంగ ప్రసాద్ మాట్లాడుతూ, సవరించిన ఔషధ తయారీ సంస్థల ప్రమాణాలు షెడ్యూల్-ఎం అమలుకు అవసరమైన నైపుణ్యాన్ని అధికారులకు అందించడమే ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, వివిధ హోదాల్లోని ప్రభుత్వ అధికారులు ఈ హాజరయ్యారు.
Prajavartha Online Telugu News