నేతన్నల బాగు కోరుకునే ప్రభుత్వం మాది

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
-అర్హులైన నేతన్నలందరికీ ‘నేతన్నల సేవలో’
-హామీ ఇవ్వకున్నా ఏటా రూ.25 వేలు ఇస్తున్నాం
-చేనేతలు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

చీరాల, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి ఒక్క నేతన్నకూ నేతన్నల సేవలో పథకం కింద ఏటా రూ. 25 వేలు అందజేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. చేనేతలు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా నేతన్నల సేవలో పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం చీరాలలోని కొత్తపేటలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా 12 వ జాతీయ చేనేత దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత పాల్గొని ప్రసంగిస్తూ… నేతన్నల బాగు కోరుకునే ప్రభుత్వం తమదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలన చేపట్టిన ప్రతిసారీ చేనేతలకు స్వర్ణయుగమేనన్నారు. ముఖ్యంగా 2014-19 మధ్య నేతన్నల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు అందజేసిన ఘనత కూడా ఆయనదేనన్నారు. త్రిఫ్ట్ ఫండ్, ముద్రా రుణాలు అందజేశారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అసమర్ధ పాలనలో చేనేతలు అన్ని విధాలా నష్టపోయారన్నారు. చేనేతల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అమలు పథకాలను జగన్ నిలిపేశారన్నారు. 2024 ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చేనేతలకు మంచి రోజులు ప్రారంభమయ్యాయన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా, మేనిఫెస్టో లో పేర్కొన్నకపోయినా చేనేతలకు ఏటా రూ.25 వేలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. 73 వేల చేనేతలకు రూ.180 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత తెలిపారు. ఇటీవలే చీరాలలో చేనేతల జాతిపిత ప్రగట కోటయ్య జయంతిని ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.పది కోట్లతో అమరావతిలో ప్రగడ కోటయ్య స్మృతి వనం నిర్మిస్తున్నామని, ఈ స్మృతి వనం నిర్మాణంలో మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్ధసారథి, మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చేనేత, జౌళి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, భారీ సంఖ్యలో చేనేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *