
-బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించిన విద్యార్థులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విప్రో, నాస్కామ్ జాతీయ స్థాయిలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమాల్లో కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు, రజత, కాంశ్య పతకాలను సాధించినట్లు యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ సారధివర్మ వెల్లడించారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో భవిష్యత్ పరిజ్ఞానమైన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, బిగ్ డేటా , క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ప్రాసెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాలపై నాస్కామ్ – విప్రో సంయుక్త ఆధ్వర్యంలో 4 నెలల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో తమ విద్యా సంస్థ నుంచి 825 మంది పాల్గొన్నారని, అందులో 763 మంది బంగారు, 131 మంది రజత, 48 మంది కాంశ్య ధృవీకరణాలను పొందినట్లు వివరించారు. అలాగే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంశంలో రుపేంద్ర సత్య వరప్రసాద్, నాగమాధురి, సాయిలోకేష్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ అంశంలో గాయత్రీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శ్రీవైష్ణవి ఐదుగురు విద్యార్థులు బంగారు ధృవీకరణాలతో పాటు విశేష ప్రతిభ కనబరచినందుకు ప్రత్యేక ప్రశంసా పత్రాలను కూడా పొందారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో క్యాంపస్ ప్లేసెమెంట్స్ పొందాలంటే విశేషమైన నైపుణ్యం ఉండాలని ఆ దిశగా తమ విద్యా సంస్థ ప్లేసెమెంట్స్ విభాగం, నైపుణ్యాల అభివృద్ధి విభాగం సంయుక్తంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ ప్లేసెమెంట్స్ విభాగం డీన్ డాక్టర్ ఎన్.బి.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. సాంకేతికంగా భవిష్యత్ పరిజ్ఞానంపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే విప్రో – నాస్కామ్ జాతీయ స్థాయిలో సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే వివిధ కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యం పెంపొందించుకునేలా నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు మూడు వేల మందికి పైగా విద్యార్థులు అర్హత పొందారని తెలిపారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా తమ విద్యార్థులు క్యాంపస్ ప్లేసెమెంట్స్‌లో ప్రముఖ జాతీయ, అంతర్ జాతీయ కంపెనీల్లో అత్యధిక ప్యాకేజీలతో ఉద్యోగాలను పొందుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, ప్లేసెమెంట్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణచైతన్య పాల్గొన్నారు. విప్రో – నాస్కామ్ జాతీయ శిక్షణలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు యూనివర్సిటీ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది.
Prajavartha Online Telugu News