కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
కౌలు రైతు మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమయ్యింది. యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని భార్య భూలక్ష్మిని ఓదార్చారు. సుబ్బారాయుడు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఆత్మహత్య అనంతరం ప్రభుత్వ స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున రూ. లక్ష చెక్కును ఆమెకు ఆర్ధిక సాయంగా అందించారు. బిడ్డల భవిష్యత్తుకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడు భార్య మాట్లాడుతూ.. తన భర్త మృతి చెందిన ఈ రెండేళ్లలో ప్రభుత్వ సాయం కోసం సుమారు వందల సార్లు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం దక్కలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నాయకులు చింతా సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

కౌలు రైతు చిన్న హుస్సేనీ కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న మరో కౌలు రైతు దూదేకుల పండ్లాపురం చిన్న హుస్సేనీ కుటుంబానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందచేశారు. వ్యవసాయంలో అప్పులపాలు కావడంతో హుస్సేనీ ఏడాదిన్నర క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాత్రలో భాగంగా నంద్యాల జంక్షన్ వద్ద హుస్సేనీ భార్య పండ్లాపురం ర్బీ అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐదు ఎకరాల్లో మిర్చి, ఐదు ఎకరాల్లో జొన్న సాగు చేయగా పంట నష్టం, గిట్టుబాటు దక్కక నష్టం వచ్చినట్టు ఆమె పవన్ కళ్యాణ్ కి వివరించారు. ఇంటి పెద్ద చనిపోయి దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కనీసం పలుకరింపు కరువయ్యిందని వాపోయారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని చెక్కు రూపంలో శామిర్ బీకి అందచేశారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నాయకులు డా. బాల వెంకట్, అర్షద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు
జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల నియోజకవర్గం జిల్లెళ్ళలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు గైని నరహరి కుటుంబాన్ని పరామర్శించారు. ఎప్పటినుంచో వ్యవసాయాన్ని నమ్ముకున్న నరహరి ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని వేరుశెనగ వేశారు. సరైన దిగుబడి రాక, కౌలు డబ్బులు కట్టుకోలేక అప్పుల పాలయ్యాడు. భారీగా అప్పులు ఎదురుగా కనిపించే సరికి ఏం చేయాలో తెలియక, వాటిని తీర్చే దిక్కులేక పురుగుల మందు తాగి పొలంలోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరహరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అప్పుల వారి బాధలు పడలేక ఇంట్లోని నగలు కుదువ పెట్టి అప్పులు తీర్చామని మృతుని భార్య మహాలక్ష్మి పవన్ కళ్యాణ్ ఎదుట వాపోయారు. ఏడాదిన్నర క్రితం కుదువ పెట్టిన నగలకు వడ్డీ మీద వడ్డీ అవడంతో వాటిని కనీసం విడిపించుకునే స్తోమత కూడా తనకు లేదంటూ పవన్ కళ్యాణ్ కి తమ బాధలు చెప్పుకొన్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని, ఎన్నోసార్లు వాలంటీర్లకు, సచివాలయాలకు తిరిగినా ఫలితం లేకపోయిందని బాధితులు చెప్పారు. వారి బాధలు, కుటుంబ సమస్యలు విన్న పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి తగిన ధైర్యం చెప్పారు. రూ లక్ష రూపాయల చెక్కును అందజేశారు. తమ వంతుగా కచ్చితంగా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నాయకుడు ఎస్.వెంకప్ప పాల్గొన్నారు.

అప్పుల కుప్పలు పేరుకుపోయి కౌలు రైతు ఆత్మహత్య
-రూ. లక్ష సాయం చేసిన పవన్ కళ్యాణ్
ఆళ్లగడ్డ నియోజకవర్గం వనికెందిన్నే గ్రామానికి చెందిన కౌలు రైతు బండి సురేంద్ర వ్యవసాయంలో వరుస నష్టాల కారణంగా అప్పుల పాలై రెండేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అతని భార్య నాగలక్ష్మి, తండ్రి సుబ్రహ్మణ్యంలను అడిగి బలవన్మరణానికి కారణాలు తెలుసుకున్నారు. అనంతరం నాగలక్ష్మికి రూ. లక్ష ఆర్ధిక సాయం అందించారు. బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఆ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, జిల్లా పార్టీ నాయకులు రేఖా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News