-మద్దూరులంక వరద ఉధృతి గ్రామాల్లో పర్యటించిన..
-మంత్రి తానేటి వనిత, కలెక్టర్ మాధవీలత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు చర్యగా జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయి లో సిద్దం చెయ్యడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం ఉదయం కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామాలలో హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ కె. మాధవిలత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా తదితరులు పర్యటించారు . ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముంపు గ్రామంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా తరలించడం జరుగుతుందని తెలిపారు. మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే ప్రతి ఒక్కరినీ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, క్షేత్ర స్థాయి లో జరుగుతున్న ఏర్పాట్లు ను పరిశీలించడం కోసం పర్యటిస్తున్నా మన్నారు. పునరావాస కేంద్రానికి తరలి వెళ్లే ప్రజల కుటుంబాలకు ముఖ్యమంత్రి 2000 రూపాయలు చొప్పున పరిహారాన్ని ప్రకటించడం జరిగిందని, ఈ విషయంలో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం పై ఆదేశాలు జారీ చేశామన్నారు. వరద ప్రాంతాల్లో ఎటువంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా అని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పునరావస కేంద్రాలకు తరలి వెళ్లాలన్నారు. మద్దూరులంక గ్రామానికి వలస వచ్చిన వారందరిని ముందుగానే పాఠశాలలోఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉంచామన్నారు. వారికి త్రాగునీరు, భోజనం, దుప్పట్లు అందించామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని బండ్స్ ను ఇసుక బస్తాలతో పటిష్టపరిచారన్నారు. ఎటువంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రస్తుత సీజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా మెడికల్ క్యాంపు లను గ్రామాల్లో ఏర్పాటు చేసి అత్యవసరమైన మందులు, వైద్య సహాయం అందించడంకోసం ఏర్పాట్లు చేశామన్నారు. ముంపు గ్రామాల కుటుంబాలకు భరోసా కల్పించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం 25 కేజీలు బియ్యం, కిలో నూనె, కోలోకందిపప్పు, ఆలుగడ్డలు, ఇతర సరుకులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్బగంగా మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ మాధవిలత గ్రామంలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు గోదావరి నదికి చేరుతోందని, పరిస్థితి కి అనుగుణంగా జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయి లో సిద్దం చేశామన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు నమోదు అవుతున్నందున దృష్ట్యా వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
Prajavartha Online Telugu News