-రూ. 3 కోట్ల విలువైన వాంబేకాలనీ ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నగరంలో రోడ్ల పునరుద్ధరణ పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఎక్సెల్ ప్లాంట్ నుంచి వాంబేకాలనీ డిస్నీల్యాండ్ వరకు రూ. 3 కోట్ల నిధులతో 1.25 కి.మీ. మేర చేపట్టనున్న ప్రధాన రహదారి విస్తరణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, వైసీపీ డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన నిర్వహించారు. ఈ రహదారి గుండా నిత్యం 20 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారని.. రోడ్డు విస్తరణతో వీరందరికీ ప్రయాణం సులభతరం కానుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. దీంతోపాటు అంతర్గత బీటీ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే వాంబేకాలనీలో శ్మశానవాటిక ఏర్పాటుకు రూ. 15 లక్షల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించినట్లు తెలియజేశారు. చంద్రబాబు హయంలో రహదారుల నిర్వహణను కనీసం పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో.. నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిని ఇబ్బందికరంగా తయారయ్యాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో రోడ్లు, భవనాల శాఖ నుండి రూ. 3 వేల కోట్ల నిధులు పక్కదారి పట్టాయని విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పిదాలకు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో.. రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్లలో రూ.95.13 కోట్ల నిధులతో 73.65 కి.మీ. పొడవున రహదారుల పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధిని అంతా ఇటీవల ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు సుస్పష్టంగా వివరించడం జరిగిందన్నారు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంభించే విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఈ(ఇంజనీరింగ్) మౌసమి, వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు పిల్లి కృష్ణవేణి, బత్తుల దుర్గారావు, బాబు, ఫాతిమా, ఇస్మాయిల్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News