-మీటర్లు మీ మంచికే .. తప్పుడు ప్రచారం నమ్మొద్దు
-రైతులకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి విజ్ఞప్తి
-నగదు బదిలీ తో నాణ్యమైన విద్యుత్ పై రైతులకు దీర్ఘ కాలికంగా సంపూర్ణ హక్కు
-అన్నదాతకు అండగా ఉంటాము .. సేద్యాన్ని “పండగ” చేస్తాం
-శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ .. 34 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా
-30 ఏళ్ళు పాటు నిర్విఘ్నంగా వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్..
-సగర్వంగా ప్రకటించిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి .. ఏకైక ప్రభుత్వం
-విశ్వసనీయతకు మారుపేరు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
-ఒకసారి మాట ఇచ్చిన తరువాత ఏ పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేయలేదు
-రైతు భవిష్యత్ కోసమే మీటర్లు
-మీటర్ల ఏర్పాటు వల్ల రైతులు ఎంత కరెంటు వినియోగిస్తున్నారో , ఎంత చెల్లిస్తున్నారో తెలుసుకునే అవకాశం
-విద్యుత్ సంస్థల నష్ఠాలను రైతుల ఖాతాల్లోకి నెట్టకుండా నిరోధించేందుకు దోహదం
-రానున్న 30 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ కు ఢోకా లేదు
-రైతుల కోసమే ప్రత్యేకంగా సెకి నుంచి 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు
-రైతులను తప్పుద్రోవ పట్టించే దుష్ప్రచారాలు నమ్మొద్దు
-ఉచిత విద్యుత్ పై ఎలాంటి భయాందోళనలు వద్దు
-రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
-నగదు బదిలీ వల్ల రైతులు ఒక్క పైసా చెల్లించనవసరం లేదు .
-రైతుల ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ
-విద్యుత్ సంస్థల్లో పారదర్శకత,జవాబుదారితనం పెరిగేందుకు దోహదం
-రాష్ట్ర వ్యాప్తంగా అంగీకార పత్రాలు సమర్పించిన లక్షలాది రైతులు
-రైతుల ప్రయోజనాలు పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం
-ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగే ప్రస్నే లేదు
-రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేది ముఖ్యమంత్రి ఆశయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పై రైతులకు దీర్ఘకాలికంగా సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తుంది. దీనివల్ల ఉచిత విద్యుత్ పథకం మరింత బలోపేతమవటమే గాక విద్యుత్ సంస్థల్లో జవాబుదారితనం ఏర్పడుతుంది, తద్వారా రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుంది . అంతిమంగా ఇది రైతు సాధికారికతకు దోహద పడుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని రైతులకు మరింత ప్రయోజనకారిగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు నగదు బదిలీ పథకం దోహదపడనుంది. ఉచిత విద్యుత్ పై రైతులకు నిజమైన హక్కు కల్పించడమేగాక డిస్కాములను బలోపేతం చేసేందుకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. వచ్చే 30 ఏళ్ళ పాటు వ్యవసాయానికి అత్యంత నాణ్యమైన ఉచిత విద్యుత్ ను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
విద్యుత్ అధికారులతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకం, వ్యవసాయానికి 9 గంటల పగటి పూట విద్యుత్ మీద జరిగిన సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా నగదు బడిలి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకం లో లబ్దిదారులైన రైతులెవరూ విద్యుత్ బిల్లుల నిమిత్తం ఒక్క పైసా కూడా చెల్లించవల్సిన అవసరం లేదని తెలిపారు.నెలవారీ విద్యుత్ బిల్లులు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. రైతుల ఖాతాల నుండి నేరుగా డిస్కాములకు చెల్లింపబడతాయి అని తెలిపారు. దీని వల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రైతులు డిస్కాములను డిమాండ్ చేసే హక్కు వారికీ లభిస్తుందన్నారు. అంతిమంగా ఇది విద్యుత్ సంస్థల పారదర్శకత, జవాబుదారితనం పెరిగేందుకు దోహదపడుతుందని వివరించారు.
అలాగే వ్యవసాయ పుంపుసెట్లకు మీటర్లు బిగించడం పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మంత్రి ఖండించారు. కేవలం రైతులను తప్పు ద్రోవ పట్టించేందుకే అసత్యాలను ప్రచారంచేస్తున్నారన్నారు. మీటర్ల ఏర్పాటు చేయడం వల్ల రైతులు తమ వ్యవసాయ కనెక్షన్లకు తాము కచ్చితంగా ఎంత విద్యుత్ వాడుతున్నారు తమకు తెలుస్తుందని అలాగే అందుకోసం ఎంత మొత్తం చేల్లిస్తున్నారో కూడా తేటతెల్లమవుతుందని తెలిపారు. విద్యుత్ సంస్థలకు వివిధ కారణాల వల్ల వచ్చే నష్టాలను రైతుల సబ్సిడీ అకౌంట్ లోకి నెట్టివేయకుండా నిరోధించేందుకు మీటర్లు ఉపయోగపడతాయని తెలిపారు. దీనివల్ల విద్యుత్ కొనుగోళ్లలోనూ పారదర్శకత ఏర్పడుతుందని , విద్యుత్ వృదాను, సరఫరా నష్టాలను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఒక రైతుకు ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉండాలో అనే అంశం పై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించదని స్పష్టం చేసారు. ఇపుడున్న అన్ని వ్యవసాయ కనెక్షన్లకి విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. అలాగే అనధికార, అధిక లోడ్ కనెక్షన్లు కూడా క్రమబద్దీకరించబడతాయని అని తెలిపారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి సంబందించి రైతులు బాధ్యతను ప్రభుత్వమే వహిస్తుందని తెలిపారు. ఈ దృష్ట్యా ఉచిత విద్యుత్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేసారు. రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. రానున్న 30 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేసారు. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి తోని ప్రత్యేకంగా వ్యవసాయం కోసమే 7000 మెగా వాట్ల విద్యుత్ను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతారని మంత్రి తెలిపారు.
“30 ఏళ్ళు పాటు నిర్విఘ్నంగా వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్. పథకం దేశంలోనే సగర్వంగా ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ప్రభుత్వం మాదే” అని అన్నారు. విశ్వసనీయతకు మారుపేరు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఒకసారి మాట ఇచ్చిన తరువాత ఏ పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేయలేదు” అని స్పష్టం చేసారు.
రైతు సంక్షేమానికి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తారని దాని వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగవడమేగాక ఆర్థికాభివృద్ధికి దోహదకారి అవుతుంది. రాష్ట్రం లోని రైతుల ప్రయోజనాలు కాపాడే అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుందని మంత్రి తెలిపారు. వచ్చే 30 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ కు ఎలాంటి ఢోకా లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. రైతుల జీవితాలు మెరుగుపడితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు.
నగదు బదిలీ పథకం నిమిత్తం ప్రభుత్వం రైతుల పేరు మీద ప్రత్యేక ఖాతాలు తెరుస్తుంది . ఈ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే డబ్బు విద్యుత్ బిల్లుల నిమిత్తం డిస్కాములకు చెల్లించడం జరుగుతుంది .ఈ ఖాతాను ఇతరేతర అవసరాలకు వినియోగించేందుకు వీలు పడదు. తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కౌలు రైతులకు కూడా దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. నగదు బదిలీ పథకం , మీటర్ల ఏర్పాటు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సానుకూలంగా స్పందించడం ఆహ్వానించ దగ్గ పరిణామం అని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు .
రాష్ట్రంలోని మీటర్ల ఏర్పాటు, నగదు బదిలీ పథకానికి అనుకూలంగా రాష్ట్రంలో లక్షలాదిమంది రైతులు ఇప్పటికే అంగీకార పత్రాలను డిస్కాములకు అందచేశారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన నగదు బదిలీ పథకం విజయవంతమైందని అధికారులు తెలిపారు. మీటర్లు బిగించడం వల్ల 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయటం జరిగింది. ఇప్పటికే దేశంలో చాల రాష్ట్రాలు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇవి ఎంతగానో దోహదకారి అవుతాయని అధికారులు తెలిపారు .
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , కె విజయానంద్ , సిఎండీ ఏపీ ట్రాన్స్కో , బీ శ్రీధర్ , జెఎండీ ఏపీ ట్రాన్స్కో , ఐ పృథ్వి తేజ్ , డిస్కాముల సిఎండీలు, కె సంతోష రావు , జె పద్మ జనార్ధన రెడ్డి, ఇతర డైరెక్టర్లు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.
ఇప్పటికే 97 శాతం మంది రైతులు డీ బీ టీ కి అనుకూలంగా పత్రాలను సమర్పించటం పట్ల ఇంధన శాఖ మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేసారు. విద్యుత్ రంగం బలోపేతానికి , రైతులకి ప్రయోజనం కలిగించేదిశగా ఇది గొప్ప ముందడుగని మంత్రి పేర్కొన్నారు. మీటర్ల ఏర్పాటు, నగదు బదిలీ పై రైతులకు ఏవైనా అపోహలుంటే వాటిని తొలగించడానికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు.
Prajavartha Online Telugu News