-62వ డివిజన్ 269 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన మేనిఫెస్టోని రూపకల్పన చేయడమే కాకుండా.. అధికారంలోకి రాగానే నిబద్ధతతో అమలు పరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సోమవారం 62 వ డివిజన్ 269 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మిలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. A1 టీస్టాల్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి హరిహర క్షేత్రం వరకు విస్తృతంగా పర్యటించారు. 320 గడపలను సందర్శించి గ్రీవెన్స్ స్వీకరించారు. ఈ సందర్భంగా మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మంచితో పాటు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను వివరించారు. ప్రజలకు అందించిన సంక్షేమంతో పాటు వాడవాడలా జరిగిన అభివృద్ధి గూర్చి గడప గడపకు వెళ్లి ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కానీ జగనన్న ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచడం జరుగుతోందన్నారు. ఈనెల 22 న అమలు కానున్న వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి.. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలియజేశారు. పర్యటన సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, డ్రెయిన్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖలకు సూచించారు.
సచివాలయ పరిధిలో రూ. 4.34 కోట్ల సంక్షేమం
కుల, మత, వర్గ, ప్రాంత భేదం లేకుండా అర్హతే ప్రామాణికంగా పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. 269వ వార్డు సచివాలయ పరిధిలో మూడేళ్లలో రూ. 4.34 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 349 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 369 మందికి రూ. 55.35 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 94 మందికి రూ. 21.15 లక్షలు., కాపునేస్తం ద్వారా 38 మందికి రూ. 5.70 లక్షలు., జగనన్న తోడు ద్వారా 41 మందికి రూ. 4.10 లక్షలు., చేయూత ద్వారా 96 మందికి రూ. 18 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 19 మందికి రూ. 2.85 లక్షలు., వాహనమిత్ర ద్వారా 28 మందికి రూ. 2.80 లక్షలు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 28 మంది రూ. 2.80 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంపై ఏమాత్రం ప్రేమ, బాధ్యత లేని టీడీపీ, బీజేపీ
టీడీపీ హయాంలో ఏ ఒక్క పేద కుటుంబానికీ న్యాయం చేయని గత పాలకులు.. సీఎం జగన్ పై పనిగట్టుకుని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆంధ్రరాష్ట్రానికి ఏం చేశామో ప్రజల ముందుకు వచ్చి చెప్పే ధైర్యం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి లేకుండా పోయిందని.. కనుకనే విష ప్రచారం మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమ రాజకీయ స్వార్థంతో చంద్రబాబు, సోము వీర్రాజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారని.. ప్రత్యేక హోదాపై మాట మార్చి ఇరుపార్టీలు చేసిన ద్రోహాన్ని తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. కేంద్ర హోం శాఖ నుంచి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్న రాష్ట్ర పోలీస్ శాఖ గూర్చి.. అదే పార్టీకి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోమువీర్రాజు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు ప్రభుత్వ భూములను పరిరక్షించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ కఠినతరంగా వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బుడమేరు ఆక్రమణల పేరుతో పచ్చ మీడియాలో వస్తున్న వరుస కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. సమాచారం తెలిసిన వెంటనే ఇరిగేషన్ అధికారులు ఆయా భూములను పరిరక్షించడం జరిగిందన్నారు. బుడమేరు పరిసర ప్రాంతాలలో పెద్దఎత్తున ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగింది గత తెలుగుదేశం హయాంలోనేనని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలతో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ.. ఆ అక్రమాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చే పనిలో నిమగ్నమయిందని వివరించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, వైసీపీ నాయకులు అలంపూర్ విజయ్, రామిరెడ్డి, వీరంకి నాగేశ్వరరావు, బోరా బుజ్జీ, మోదుగుల గణేష్, హైమావతి, రెడ్డెమ్మ, గ్రేసీ, సావిత్రి, సుభాన్, వెంకట్, శ్రీను, సాంబయ్య, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News