-64వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు పేదలను వెతుక్కుంటూ గుమ్మం వద్దకే చేరుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గురువారం 64 వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కుందావారి కండ్రికలో విస్తృతంగా పర్యటించి.. 170 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల ఉన్నతికి ఎంతగానో దోహదపడుతున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 27 వేల నిరుపేద కుటుంబాలకు ఇప్పటివరకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని.. సొంత స్థలం కలిగి ఇళ్లు నిర్మించుకోవాలనుకుంటున్న వారికి సైతం రూ. లక్షా 80 వేలు సబ్సిడీ రూపంలో అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట్ల వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, డ్రెయిన్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సిబ్బందికి సూచించారు. అలాగే ఇళ్ల పక్కన ఖాళీ స్థలాలతో స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. పర్యటనలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇంకా ఏమైనా అభ్యర్థనలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని.. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.
రైతన్నకు అండగా సీఎం వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతన్నలకు స్వర్ణయుగమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గడప గడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అన్నదాతలు సంపూర్ణ మద్ధతు తెలపడం సంతోషదాయకమన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రైతులను నిండా దగా చేసిందని.. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల ముంగిటకే వ్యవసాయ పథకాలను తీసుకువచ్చిందని వెల్లడించారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పథకం, రాయితీ విత్తనాలు, పురుగుమందులు, యాంత్రీకీకరణ పరికరాలు వంటి సంక్షేమ పథకాలతో జగనన్న ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందని చెప్పుకొచ్చారు. రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటివరకు రూ. 33 లక్షల 42 వేల 500 రూపాయల లబ్ధిని నియోజకవర్గంలోని అన్నదాతలకు చేకూర్చినట్లు తెలిపారు. అన్నదాతల విషయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్న కలలను.. సాకారం చేసిన తనయుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని మల్లాది విష్ణు అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సోము వీర్రాజుకు మతిభ్రమించింది
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కలసి మెలసి ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్ అభిమతమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. కనుక ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో పాలన జరుగుతోందని సోమువీర్రాజు మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులనే.. దామాషా ప్రకారం కేంద్రం తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించడం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇవిగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించిన నిధులు ఏమైనా ఉంటే సోము వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా.. బాధ్యతను విస్మరించి రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావని మల్లాది విష్ణు విమర్శించారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సహా విభజన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, వైసీపీ నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఎం.రవీంద్రా రెడ్డి, దేవిరెడ్డి మంగారెడ్డి, పిన్నిబోయిన కృష్ణ, దేవిరెడ్డి కిరణ్ రెడ్డి, మరీదు వీరయ్య, పందిరి వాసు, జిల్లెల్ల శివ, రమేష్, ఇస్మాయిల్, భోగాది మురళి, వరాలమ్మ, వెంకటేశ్వరమ్మ, కుమారి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News