Breaking News

శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర హోం, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి డా. తానేటి వనిత అన్నారు. ఈనెల 26వ తేదీ నుండి అక్టోబర్‌ 5వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను గురువారం నగరంలోని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్లో రాష్ట్ర హోం, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి డా. తానేటి వనిత అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియా ప్రతి నిధులతో మంత్రి మాట్లాడుతూ సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇప్పటికే 90 శాతం పైగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని శనివారం నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేసి సిద్దం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు, ఉండాలని భక్తుల మనోభావాలకు ఆటంకం కలగకుండా ప్రతి భక్తునికి అమ్మవారి దర్శన భాగ్యం కల్గి ఆనందంగా వెళ్లేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారని సంతోషంగా అమ్మవారిని దర్శించుకునికునేలా అధికారులు సహకరించాలన్నారు. ట్రాఫిక్‌కు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్లింపు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ శాఖను ఆదేశించామన్నారు. శానిటేషన్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరపాలక సంస్థ దేవదాయ శాఖలను ఆదేశించామన్నారు. భక్తులకు ప్రసాదాల కొరత లేకుండా ప్రసాదం కౌంటర్లు, తలనీలాలు సమర్పించేందుకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక మెడికల్‌ క్యాంపులను అంబులెన్స్‌లను సిద్దంగా ఉంచాలన్నారు. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర సరఫరా ఉండాలని ముఖ్యంగా రాత్రి సమయంలో పవర్‌ కట్‌ లేకుండా చూడాలని విద్యుత్‌ అదికారులను ఆదేశించామని మంత్రి అన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రం పైన ప్రభుత్వం పైన ఉండాలని కోరుకుందామని మంత్రి తానేటి వనిత అన్నారు.
ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్సవాలలో ప్రతి అధికారికి బాధ్యతలు అప్పగించామన్నారు. రెవెన్యూ, పోలీస్‌, నగరపాల సంస్థ, దేవాదాయ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఉత్సవాల విజయవంతానికి మీడియా సహకారం కూడా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు.
మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి అమ్మవారి దర్శనం అందరికి కల్పించేలా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు అన్నారు.
జిల్లా కలెక్టర్‌ యస్‌. డిల్లీరావు మాట్లాడుతూ శరన్నరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. అధికారులు అక్టోబర్‌ 7 తేది వరకు విధులను నిర్వర్తించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని కలెక్టర్‌ అన్నారు.
తొలుత మంత్రి తానేటి వనిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఉత్సవాలలో శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఎప్పటికప్పడు ఘాట్లను కేశఖండన శాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.బ్యారేజిలో వరద నీరు ఎక్కువగా ఉన్నందున ఘాట్లలో మెష్‌లను ఏర్పాటు చేయాలన్నారు. గజఈతగాళ్లను, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బందిని నియమించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే మూలనక్షత్రం రోజున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదం కౌంటర్లు వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేయాలని మంత్రి అన్నారు.
సమావేశంలో పోలీస్‌ కమీషనర్‌ కాంతి రానా టాటా, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, శాసనమండలి సభ్యులు రహుల్లా, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్‌, డిప్యూటి మేయర్‌ బెల్లం దుర్గ, జాయింట్‌ కలెక్టర్‌ నూపుర్‌ అజయ్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ ఆలయ ఈవో డి. భ్రమరాంభ, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *