-చేయూత వారోత్సవాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైఎస్సార్ చేయూత ద్వారా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవనోపాధి కల్పన, ఆర్థిక సాధికారత చేకూరుస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ముత్యాలంపాడులోని అల్లూరిసీతారామరాజు కళ్యాణ మండపం నందు శనివారం జరిగిన వైఎస్సార్ చేయూత వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా వారి అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమంలోనూ మహిళలకే అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ.. వారి అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ఇళ్ల పట్టాల నుంచి అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, ఆసరా, చేయూత వంటి పథకాలు మహిళలకే అందిస్తూ.. కుటుంబం ఆర్థికంగా బలపడేందుకు కృషి చేస్తున్నారన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేయడం ఒక అద్భుతమన్నారు. కేవలం ఒక్కసారి బటన్ నొక్కితే లక్షలాది మందికి లబ్ధి చేకూరడం గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. చేయూత పథకం మూడో విడత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 4,949 కోట్ల లబ్ధి చేకూరగా.. సెంట్రల్ నియోజకవర్గంలో 10,875 మందికి రూ. 20.39 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు. వీరిలో 28వ డివిజన్ లో 282 మంది., 29వ డివిజన్లో 495 మంది., 31 వ డివిజన్లో 393 మంది అక్కచెల్లెమ్మలు ఉన్నట్లు తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ చేయూత పథకాన్ని ఆర్థిక నిపుణులు సైతం కీర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే మహిళా శక్తిపై అపార నమ్మకంతో అనేక కీలక పదవుల్లో వారికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. మరోవైపు సంక్షేమ క్యాలెండర్ ద్వారా ఏఏ నెలలో ఏఏ పథకాలు అమలు కానున్నాయో ప్రజలకు వివరించడంతో పాటు.. పథకాలకు అవసరమైన పత్రాలను జారీ చేయడంలో వార్డు సచివాలయాలు పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. ఈ చేయూత సాయాన్ని ఆడపడుచులందరూ సద్వినియోగపరచుకునేలా.. వ్యాపారాలు చేసుకునే వారిని బ్యాంకులతో అనుసంధానం చేసే బాధ్యతను పీఓయూసిడి విభాగం తీసుకోవాలని సూచించారు. తమది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పథకాలను అమలు చేసే ప్రభుత్వం కాదని.. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి కూడా పేదరిక నిర్మూలన, మహిళా అభ్యున్నతి దిశగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వమని పునరుద్ఘాటించారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలకు అందుతున్న ఆర్థికసాయం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. మహిళల పేరిట పెద్దఎత్తున పథకాలు అమలు చేస్తుంటే చూసి జీర్ణించుకోలేక.. చంద్రబాబు, టీడీపీ నాయకులు కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మచ్చ హిమచంద్రిక, లబ్ధిదారు మాట్లాడుతూ కుమారుడు మరణించిన తనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దకొడుకుగా నిలిచారని భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ ఆర్థిక ఎదుగుదలకు దన్నుగా నిలిచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అండగా నిలబడతానని తెలియజేశారు. అనంతరం మల్లాది విష్ణు చేతుల మీదుగా మహిళలకు నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి శకుంతల, సిడిఓ జగదీశ్వరి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, కొంగితల లక్ష్మీపతి, ఇసరపు దేవి రాజారమేష్, యరగొర్ల తిరుపతమ్మ, జానారెడ్డి, నాయకులు పిల్లి కృష్ణవేణి, కనపర్తి కొండా, బెజ్జం రవి, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News