విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అందరికి ఆరోగ్యంలో భాగంగా రక్తహీనత రహిత జిల్లాగా తీర్చిదిద్ది ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు.
స్తుస్థిరాభివృద్ది లక్ష్యం అందరికి ఆరోగ్యంలో భాగంగా పోష్టికాహారాన్నిఅందరికి అందించాలనే మానవాభివృద్ధి సూచికను జిల్లాలో నూరుశాతం సాధించే దిశగా విద్య, వైద్యఆరోగ్య , స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో పౌష్టికాహారం, రక్తహీనత, డ్రాప్ అవుట్ తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రక్తహీనతను నివారించి ఆరోగ్యకర సమాజనిర్మాణంలో భాగంగా కౌమార దశ నుండి పుట్టేబిడ్డ వరకు అన్ని స్థాయిల్లోనూ పౌష్ఠిక ఆహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందన్నారు.బాలికల కౌమార దశ కీలకమని ఆ దశలో పోష్టికాహారం అందించి రక్తహీనతను నివారిస్తే గర్భస్థ దశలోనూ అనంతరం ఆరోగ్యకర చిన్నారుల జననం జరుగుతుందన్నారు. ఇందుకు నాలుగు దశలలో వైద్యఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో ప్రభుత్వం ద్వారా అందించే పధకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వయస్సుకు తగ్గ బరువు, వయస్సుకు తగ్గ ఎత్తు, కలిగిన వారిని గుర్తించడం, 12 సంవత్సరాలు పైబడిన బాలికలు, 18 నుండి 49 సంవత్సర వయస్సు మధ్య గర్భవతులలో రక్తహీనత లేకుండా చూడడం, ప్రాధమిక విద్యాస్థాయిలో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగి 8 వ తరగతి లోపు పిల్లలు,ప్రభుత్వ ప్రైవేట్, హై స్కూల్, జూనియర్ కళాశాల స్థాయిలోని 14 నుండి 19 వయస్సు కలిగిన వారు పాఠశాల, కళాశాల స్థాయిలో చదువుకుంటూ ఉండాలని మధ్యలో చదువు మానేసిన వారిని గుర్తించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.. జిల్లాలోని 1554 పాఠశాలలు, 1475 అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్, త్రాగు నీరు, బాలికలకు ప్రత్యేక టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు కౌమార దశ బాలికలకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డు రూపొందించాలని అన్నారు . గర్భవతులు, కౌమార దశ బాలికలకు మధ్యన భోజనం, అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న కోడి గుడ్డును తప్పనిసరిగా, ముఖ్యంగా పచ్చసొన తినిపించాలి అన్నారు . 6 నెలల నుండి ౩ సంవత్సరాల చిన్నారులకు బాలామృతం , గుడ్లు, పాలు,తల్లులకు ఐరన్ సిరప్ ఇప్పించాలన్నారు. గర్భవతులకు డ్రై డేట్స్ , చిక్కీస్, బెల్లం, అటుకులతో కూడిన డాక్టర్ వైస్సార్ సంపూర్ణ పోషణ పథకం అందరికి అందించాలన్నారు.మానవాభివృద్ధి అనేది ఆర్థికాభివృద్ధి, విద్య , ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని కలెక్టర్ అన్నారు.
సమావేశంలో డిఏంఅండ్ హెచ్ ఓ డా.ఏం సుహాసిని , ఐసీడీస్ పిడి జి . ఉమాదేవి,సిపిఓ రత్నరూథ్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇ డివి రమణ, పంచాయితీ రాజ్ ఎస్ ఇ ఎ.వెంకటేశ్వరరావు , డీఎస్వో పి.కోమలి పద్మ , ఆర్ ఐ ఓ పి .రవికుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News