-ఇ.హెచ్.ఎస్. అమలులో సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో చర్చించండి
-డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నూతన వెబ్ సైట్,మొబైల్ యాప్ లను 26 కల్లాసిద్దం చేయాలి
-ప్రాధాన్యతా క్రమంలో కనీసం ఐదు వైద్య కళాశాలల నిర్మాణ పనులు మార్చికల్లా పూర్తి
-ఐదవ ఆర్థిక సంఘం నిధులు రూ.275 కోట్లను ఈ నెలాఖరు కల్లా విడుదల చేయాలి
-ఆరోగ్య సేవలు,ఆసుపత్రుల నిర్వహణలో సారూప్యం ఉన్న బడ్జెట్ హెడ్ ల విలీనం
-మహాప్రస్థానం వాహనాల నిర్వహణ బాధ్యలను ఎన్.జి.ఓ.లకు అప్పగించండి
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఆరోగ్య పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలపై సమీక్షా సమావేశాన్ని సిఎస్ నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని పలు ఉద్యోగ సంఘాల నాయకులు తమను కలిసి రిప్రజంటేషన్ లు ఇచ్చారని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లోని సమస్యలన్నింటినీ సాద్యమైనంత మేర పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబును ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నూతన వెబ్ సైట్, మొబైల్ యాప్ లను రూపొందించే పనులను మరియు రాష్ట్ర వ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల్లో కియోస్క్లు స్థాపన పనులన్నింటినీ ఈ నెల 26 కల్లా పూర్తిచేసి సిద్దంగా ఉంచాలని డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సిఇవోను ఆయన ఆదేశించారు. ప్రగతిలోనున్న పలు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఆయన సమీక్షిస్తూ ప్రాధాన్యతా క్రమంలో కనీసం విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఈ మార్చి మాసాంతానికల్లా పూర్తిచేయాలని ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ డి.మురళీధర్ రెడ్డిని ఆదేశించారు. ఆయా వైద్య కళాశాలల నిర్మాణ పనులకు ప్రభుత్వ పరంగా విడుదల చేయాల్సిన నిధుల విషయంలో ఏమాత్రం జాప్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఆయన సూచించారు. వైద్య కళాశాల నిర్మాణ పనులకు అవసరమైన నిధులను వచ్చే ఏడాది బడ్జెట్ లో కూడా తగిన కేటాయింపులు జరిగేలా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) నిధులను క్లైయిమ్ చేసేందుకు, పెండింగ్ లోనున్న పలు బిల్లులను క్లియర్ చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సి.ఎస్.ఆదేశించారు. ఇందులో భాగంగా ఐదవ ఆర్థిక సంఘం నిధులు రూ.275 కోట్లను ఈ నెలాఖరు కల్లా విడుదల చేయాలని సూచించారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఏ.పి.వి.వి.పి., డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిల్లో అందజేసే ఆరోగ్య సేవలు,ఆసుపత్రుల నిర్వహణలను సీఎస్ సమీక్షిస్తూ ఈ మూడు విభాగాల పరిధిల్లో సారూప్యం ఉన్న బడ్జెట్ హెడ్లను అన్నింటినీ విలీనం చేసి నిధుల మంజూరీలో ఎంతో స్పష్టత, పారదర్శకత ఉండేలా చూడాలని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణను సీఎస్ ఆదేశించారు. ఈ మూడు విభాగాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు, అందుకు మంజూరు చేయాల్సిన నిధులు, పెండింగ్ లోనున్న పైళ్ల సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సీఎస్ సుదీర్ఝంగా చర్చించారు. అదే విధంగా పారిశుద్య నిర్వహణతో పాటు డైట్, తాగునీరు, విద్యుత్, లినెన్ & లాండ్రీ సర్వీస్ చార్జీల చెల్లింపునకు అవసరమైన అదనపు నిధుల మంజూరుకు చేపట్టాల్సిన చర్యలను సీఎస్ సమీక్షిస్తూ అందుకు తగ్గట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ , ఆర్థిక శాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలను ఆయన స్పష్టంగా నిర్థేశించారు.
మహాప్రస్థానం వాహనాలతో పాటు 104 & 108 అంబులెన్సు సేవలను సీఎస్ సమీక్షిస్తూ మహాప్రస్తానం వాహనాల నిర్వహణ బాధ్యతలను ఎన్.జి.ఓ.లకు అప్పగించే విధంగా చర్యలను చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. ఇంకా సి.ఎస్.ఆర్. నిధులను వెచ్చించేందుకు పి.ఎస్.యు.లతో పాటు ఎన్.జి.ఓ.లను, ప్రైవేటు ఏజన్సీలను గుర్తించాలని అధికారులకు ఆయన సూచించారు.
నాన్ కమ్యునకబుల్ వ్యాధుల(NCD) స్క్రీనింగ్ పనుల ప్రగతిని సి.ఎస్. సమీక్షిస్తూ ఎ.ఎన్.ఎం., ఎం.ఎల్.హెచ్.పి. సేవలను పూర్తి స్థాయిలో ఇందుకు ఉపయోగించుకోవాలని, పోస్టులు ఖాళీగా ఉన్నచోట కాంట్రాక్టు ఎ.ఎస్.ఎం. సేవలను ఉపయోగించుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు మరియు వైద్యాధికారుల పోస్టుల భర్తీ ప్రగతిని సమీక్షిస్తూ ఇంకా భర్తీ కాకుండా ఉన్న 170 పోస్టుల భర్తీ విషయంలో కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సి.ఇ.ఓ. హరీంధిర ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News